‘నట్టి’ ప్రకంపనలు.. అంతా హంబక్‌.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సమాజంలోని దాదాపుగా అన్ని వ్యవస్థల్నీ వాడేసుకున్నాడన్నది నిజం. పోలీసులు అతన్ని వాడుకున్నారు.. పోలీసుల్ని ఆయన వాడుకున్నాడు. రాజకీయ నాయకులదీ సేమ్‌ పొజిషన్‌. రిజిస్ట్రేషన్‌ శాఖని నయీం…

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సమాజంలోని దాదాపుగా అన్ని వ్యవస్థల్నీ వాడేసుకున్నాడన్నది నిజం. పోలీసులు అతన్ని వాడుకున్నారు.. పోలీసుల్ని ఆయన వాడుకున్నాడు. రాజకీయ నాయకులదీ సేమ్‌ పొజిషన్‌. రిజిస్ట్రేషన్‌ శాఖని నయీం వాడుకున్న తీరు చూసి 'సిట్‌' అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారట. రియల్‌ ఎస్టేట్‌ రంగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు నయీం ఎదిగిందే ఇక్కడ. సినీ రంగంలోనూ నయీం అడుగుజాడల గురించి రకరకాల కథనాలు తెరపైకొస్తున్నాయి. 

సినీ నిర్మాత నట్టికుమార్‌, టాలీవుడ్‌లో కొందరు నిర్మాతల పేర్లు చెప్పి వారంతా నయీం కారణంగా లబ్ది పొందినవారేనని సెలవిచ్చాడు. చాలా థియేటర్లలో క్యాంటీన్లు నయీం గ్యాంగ్‌కి చెందినవేనన్నాడు. తాను కూడా నయీం కారణంగా నష్టపోయానన్నాడు. సినీ రంగంలో నయీం లబ్దిదారులు, బాధితుల గురించి పూర్తి వివరాలు తనవద్దనున్నాయని చెప్పుకొచ్చాడు. సరాసరి సిట్‌ వద్దకు వెళ్ళి ఆ వివరాలు సమర్పించక, నట్టికుమార్‌ మీడియా ముందుకొచ్చి హడావిడి చేశాడు. ఇక్కడే చాలామందికి అనుమానాలొచ్చాయి. 

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మంత్రి ఎర్రన్నాయుడుతోపాటు, తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులకి నయీంతో సంబంధాలున్నాయని నట్టికుమార్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే, అంతా కలిసి మూకుమ్మడిగా నట్టికుమార్‌ని 'పనిలేనోడు'గా తేల్చేశారు. అర్థం పర్థం లేని మాయమాటలు చెప్పడం కాదు, మీడియా ముందు హడావిడి చేయడం కాదు.. చేతనైతే ఫిర్యాదు చేస్కో.. అంటూ తేల్చిపారేశారు. 

ఏ థియేటర్‌ విషయంలో అయితే నయీం ఎంటరయ్యాడనీ, ఏ థియేటర్‌ విషయంలో అయితే మంత్రిగారి పెత్తనం పెరిగిపోయిందనీ నట్టికుమార్‌ ఆరోపించాడో, అదే థియేటర్‌ యాజమాన్యం.. నట్టికుమార్‌ తమకే 40 లక్షలు ఎగ్గొట్టాడని ఆరోపించడం గమనార్హమిక్కడ. తప్పు.. ఒప్పు.. అన్నవి ఆలోచించడు నట్టికుమార్‌. మీడియా ముందుకొస్తాడు, ఏదో హడావిడి చేసి వెళ్తాడు. తీసిన సినిమాలేంటి.? అనడక్కండి. కానీ, ఆయన నిర్మాత. తన సినిమాలతో పబ్లిసిటీ పొందడం కాదు, ఇలాంటి విషయాలతో పబ్లిసిటీ కోసం పాకులాడుతుంటాడంతే. 

అన్నట్టు, 'నేను వెళితే ఎస్పీ కూడా లేచి నిల్చోలేదు..' అంటూ నట్టికుమార్‌ మీడియా ముందుకొచ్చినప్పుడు హంగామా చేశాడు. ఎస్పీ స్థాయి అధికారి, తన వద్దకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తికి చేతులెత్తి నమస్కరించాలా.? కుర్చీలోంచి లేచి, మోకరిల్లాలా.? నట్టికుమార్‌ మాటల్లో నిజాయితీ ఎంతో ఈ ఒక్క విషయం నిరూపించెయ్యట్లేదూ.! 

నయీం బాగోతం నిజం.. నయీం వేల కోట్లు కూడబెట్టింది నిజం.. నయీం సెటిల్‌మెంట్లు చేసింది నిజం.. టాలీవుడ్‌తో నయీంకి సంబంధాలు వుంటే వుండొచ్చుగాక. కానీ, నయీం పేరుతోనూ పబ్లిసిటీ పొందాలనుకుంటున్న నట్టికుమార్‌ లాంటోళ్ళని ఏమనాలి.?