సినిమా నిర్మాతలు అందరికీ ఒక్కో సరదా వుంటుంది. ఒక్కో హీరోపై అభిమానం వుంటుంది. నిర్మాత అనిల్ సుంకర కూడా ఇలాంటి వ్యవహారం వుంది. ఆయన మహేష్ బాబుకు చాలా సన్నిహితమే అయినా, అక్కినేని ఫ్యామిలీ అంటే చెప్పలేనంత అభిమానం. ఎప్పటికైనా ఆ ఫ్యామిలీ హీరోతో ఓ సినిమా చేయాలన్నది ఆయన కోరిక. ఇది ఎప్పటి నుంచో వున్నా ఎందుకో వీలు కావడం లేదు. నాగ్, చైతన్య, అఖిల్ ఇలా ఎవరితో ఒకరితో అయినా ఓ సినిమా చేయాలని ఆయన అనుకుంటూ వస్తున్నారు. కానీ అదే సెట్ కావడం లేదు.
ఇన్నాళ్లకు ఆ కోరిక తీరుతోంది. అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఆఖరికి ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లోనే సెటిల్ అవుతోంది. ఈ సినిమా ముందు బన్నీ వాస్ దగ్గరకు వచ్చింది. ఆయన అనిల్ సుంకరకు రికమెండ్ చేసారు. ఆ తరువాత ఆయన 14రీల్స్ ప్లస్ కు ఇద్దాం అనుకున్నారు. కానీ అదీ వీలు కాలేదు.
ఆఖరికి అనిల్ సుంకరనే నిర్మించబోతున్నారు. ఈ సినిమా కాస్త బడ్జెట్ పరంగా పెద్ద సినిమానే. సురేందర్ రెడ్డి డైరక్టర్ కావడం, కాస్త ఖర్చుతో కూడుకున్న కథ కావడంతో ముఫై నుంచి నలభై కోట్ల వరకు బడ్జెట్ అవసరం పడుతుందని వార్తలు వున్నాయి. సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి సినిమా ఇదే. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్న అఖిల్ అది ఫినిష్ చేసి, ఈ సినిమా మీదకు వస్తాడు.