వెబ్ మీడియా నుంచి నేరుగా ప్రొడక్షన్ లోకి దిగుతోంది ఐ డ్రీమ్ సంస్థ. ఈ సంస్థ తొలి సినిమా త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. తోలి ప్రయత్నానికి దర్శకుడిగా చందు మొండేటిని ఎంపిక చేస్తుకుంది. తొలి సినిమా కార్తికేయ తోటే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు చందు. మలి సినిమాను నాగ్ చైతన్యతో ప్రేమమ్ గా తయారుచేసి విడుదలకు సిద్ధం చేసాడు. మూడో సినిమా ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి నిర్మాతగా ఫిక్స్ అయ్యాడు.
ఐడ్రీమ్ సంస్థ ఇంటర్ నెట్ లో విడియో కంటెంట్ ను రోజు రోజుకు పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది. యూ ట్యూబ్ లో ఐ డ్రీమ్ హవా విశేషంగా వీస్తోంది. దాదాపు 1.5 బిలియన్ (150 కోట్లు) వ్యూస్, మిలియన్ (పది లక్షలు) సబ్ స్క్రైబర్స్, 150 ఛానెల్స్, దాదాపు 15,000 గంటల డిజిటల్ కంటెంట్ (వీటిలో దాదాపు 2000 చలనచిత్రాలు), ఓటీటీ స్పేస్ లో విశేషాదరణ పొందుతూ ఐడ్రీమ్ మీడియా ప్రస్తుతం అందరు నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్, న్యూజెర్సీ కేంద్రాలుగా ఈ సంస్థ నిర్వహణ సాగుతోంది.
“చందు దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రాన్ని తాము నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని ఐ డ్రీమ్ వ్యవస్థాపకులు,సీఈవో వాసుదేవరెడ్డి చిన్నా తెలిపారు. చందు ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని, అతని నిర్దేశకత్వంలో ఓ మంచి చిత్రం తప్పకుండా జనానికి అందిస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటామన్న నమ్మకం మాకుందని ఆయన అన్నారు. చిత్ర కథానాయకుడు ఎవరన్నదానితోపాటు మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలతో మీ ముందుకు త్వరలో వస్తామని , మీడియా మిత్రులందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి.