నిర్మాతలు రెడీ.. సినిమాలేవీ?

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ నలుగురూ రెండేసి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, పూర్తి చేయాలి. ప్రభాస్ ప్రాజెక్టు ఇపట్లో పూర్తయ్యేది కాదు. బన్నీ మాత్రమే ఇంకా ఏ ప్రాజెక్టు…

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ నలుగురూ రెండేసి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, పూర్తి చేయాలి. ప్రభాస్ ప్రాజెక్టు ఇపట్లో పూర్తయ్యేది కాదు. బన్నీ మాత్రమే ఇంకా ఏ ప్రాజెక్టు ఫిక్స్ చేయలేదు. యంగ్ హీరోలు శర్వానంద్, నాని, నిఖిల్, రాజ్ తరుణ్, నాగశౌర్య, విజయ్ దేవరకోండ చేతుల్లో రెండు మూడు కాదు, అంతకు మించిన కమిట్ మెంట్లు వున్నాయి. సీనియర్లు బాలయ్య రెండు ప్రాజెక్టులు ఫిక్స్ చేసుకుని వున్నారు. నాగ్ ఒక ప్రాజెక్టు మీద వున్నాడు. వెంకీ ప్రాజెక్టు మొదలైంది. రామ్ ప్రాజెక్టు జనవరిలో స్టార్ట్ అవుతుంది.

మరి పరిస్థితి ఇలా వుంటే, కొత్త సినిమాలకు క్లాప్ పడేదెలా? చాలా మంది నిర్మాతలు పెద్ద ప్రాజెక్టులు దొరికితే చేయాలని రెడీగా వున్నారు. కానీ హీరోలు మాత్రం రెడీగా లేరు. దాదాపు ఫిక్సయిన సినిమాలకు క్లాప్ లు పడాలి తప్ప, సెట్ కావాల్సిన ప్రాజెక్టులు చాలా అంటే చాలా తక్కువ. ఇందువల్ల చాలా మంది నిర్మాతలు, చాలా సంస్థలు కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాయి.

పెద్ద నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కూడా సినిమా చేయాలని వున్నా చేయలేని పరిస్థితి. శర్వానంద్ తో హారిక హాసిని సంస్థ సినిమా స్టార్ట్ చేసింది. కానీ షూటింగ్ కు ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎందుకుంటే శర్వానంద్ వేరే సినిమా పని మీద వున్నారు. ఇలా చాలా మంది సినిమాలు ప్రకటించేసారు కానీ, ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని ప్రాజెక్టులు చాలా వున్నాయి.

ఇలాంటి టైమ్ లో చిన్న సినిమాలు వుంటాయేమో అనుకుంటే, 2017లో చిన్న సినిమాలు భయంకరంగా విడుదలయ్యాయి. 99శాతం పెట్టుబడి రీళ్లలో పోసేసినవే. తప్ప వెనక్కు తెచ్చుకున్నవి లేవు ఈ ఎఫెక్ట్ 2018మీద బాగా పడుతుందని భావిస్తున్నారు. ఈసారి చిన్న సినిమాల దాడి అంతగా వుండకపోవచ్చు. 2017లో నిర్మాణం స్టార్ట్ చేసుకున్నవే తప్ప, 2018లో అంత ఎక్కువగా చిన్న సినిమాల క్లాప్స్ వుండకపోవచ్చని అంచనా. సినిమాల విడుదల పరంగా 2017కొత్త రికార్డు సృష్టిస్తుందని, సుమారు 150సినిమాలు విడుదల అయివుండొచ్చని అంటున్నారు. గత ఏడాది జస్ట్ వందకు కాస్త అటుగా మాత్రమే సినిమాలు విడుదలయ్యాయి.

2018లో కనుక చిన్న సినిమాలు తగ్గితే థియేటర్లకు సమస్య వస్తుందని టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాలు మహా అయితే నాలుగు నుంచి ఆరు వారాలు థియేటర్లో వుంటాయి. ఏడాది మహా అయితే డజను పెద్ద సినిమాలు వుంటాయి. చిన్న సినిమాలు వందకు పైగా వుంటాయి. థియేటర్లను ఆదుకునేవి ఇవే. చిన్న సినిమాలు కనుక లేకపోతే ధియేటర్లకు సమస్య వస్తుంది. పెద్ద సినిమాల గ్యాప్ లో థియేటర్లను ఆదుకునేవి ఇవే.

ఇప్పటికే విడుదలవుతున్న చాలా సినిమాలకు కలెక్షన్లు లేక, ఒక్కోసారి థియేటర్లు షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వుంటోంది. పబ్లిసిటీ హంగామానే తప్ప, జనాలు థియేటర్లకు రావడం చాలా కష్టంగా వుంది. మెంటల్ మదిలో సినిమాకు అంత హంగామా చేస్తే, కలెక్షన్లు అంతంత మాత్రం అయ్యాయి. జవాన్ సినిమాకు కాస్త అబౌవ్ ఏవరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఏవరేజ్ గానే వున్నాయి.

అందువల్ల వచ్చే ఏడాది ప్రథమార్థం అంతా పెద్ద సినిమాలు దులిపేస్తారు. మళ్లీ ద్వితీయార్థంలో కాస్త గ్యాప్ తప్పదని టాక్. మళ్లీ చివరికి వచ్చేసరికి పోటా పోటీ వుంటుంది. ఈ మధ్య అంతా థియేటర్లు చిన్న సినిమాల వైపు చూడాలి.