నో వాట్సాప్.. ఓన్లీ లాప్ టాప్

టాలీవుడ్ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది. కొత్త టెక్నాలజీ కన్నా పాత సిస్టమ్ నే బెటర్ అనుకుంటోంది. ఊ. అంటే వాట్సప్, ఆ అంటే షేరింగ్ వంటి వ్యవహారాలను తగ్గించాలనుకుంటోంది. ఇదంతా మొన్నటి లీకుల ఫలితమే.…

టాలీవుడ్ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది. కొత్త టెక్నాలజీ కన్నా పాత సిస్టమ్ నే బెటర్ అనుకుంటోంది. ఊ. అంటే వాట్సప్, ఆ అంటే షేరింగ్ వంటి వ్యవహారాలను తగ్గించాలనుకుంటోంది. ఇదంతా మొన్నటి లీకుల ఫలితమే. గీతగోవిదం, టాక్సీవాలా, అరవింద సమేత తదితర వ్యవహారాలు అన్నీ ఇటీవల లీక్ అయిన సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లు సినిమా స్టార్ట్ అయితే  చాలు, ఓ వాట్సప్ గ్రూప్ రెడీ అయిపోయేది. ఇప్పుడు కూడా గ్రూప్ వుంటొంది. కానీ అందులో కీలకసమాచారం మాత్రం పోస్ట్ చేయడంలేదు. గతంలో హీరొలకు డైరక్టర్లకు, నిర్మాతలకు మధ్య ఏమైనా చూపించుకోవాలి అనుకుంటే వాట్సప్ సులభ మార్గంగా వుండేది. టీజర్ల రఫ్ కట్, ట్రయిలర్ల రఫ్ కట్ ఇలాంటివి అన్నీ వాట్సప్ ద్వారానే చలామణీ అయ్యేవి.

కానీ ఇప్పుడు హీరోలు, డైరక్టర్ల దగ్గరకు లాప్ టాప్ లు వెళ్తున్నాయి. లాప్ టాప్ ల్లోనే చూపిస్తున్నారు. అవసరం అయితే నమ్మకమైన మనిషిని ఇచ్చి, కారులో లాప్ టాప్ పంపిస్తున్నారు. మొత్తంమీద లీకు వ్యవహారాలు కాస్త గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది.