Advertisement


Home > Movies - Movie Gossip
బూతు సినిమాలు కాదు, కాశీనాథ్‌ ఒక కెరటం!

వాటిని బూతు సినిమాలు అని తేలిగ్గా ఒకమాట అనేయొచ్చు. కామంతోనే ఆ సినిమాలను చూసేవాళ్లు ఉండొచ్చు కానీ, అంతకు మించి చూడగలిగితే.. మాత్రం నిస్సందేహంగా కాశీనాథ్‌ అనే క్రియేటర్‌ కనిపిస్తాడు. మొన్నటి గురువారంలో తుదిశ్వాస విడిచాడాయన. ఆయన వయసెంతో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఆయన దాన్ని రహస్యంగా ఉంచాడు. దేన్నైనా రహస్యంగా ఉంచొచ్చు కానీ.. వయసును కనపడనీయకుండా ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు.

కాశీనాథ్‌కు అదిసాధ్యం అయ్యింది. కాబట్టి.. ఆయన ఇంత వయసులో చనిపోయాడు అని చెప్పడం కష్టం. మొన్నటి వరకూ యాక్టివ్‌గానే కనిపించారు. వివిధ టీవీ షోలకు గెస్టుగా హాజరవుతూ వస్తున్నారు. ఒక కన్నడ ఛానల్‌లో రమేశ్‌ అరవింద్‌ నిర్వహించే టాక్‌ షోలో కనిపించాడమధ్య. కన్నడ చిత్రపరిశ్రమకు కాశీనాథ్‌ అంటే ఒక వ్యక్తికాదు. అతడు ఎంతోమందికి గురు.

అనామకులుగా మిగిలిపోయిన వారి టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడంలో కాశీనాథ్‌ ది అందెవేసిన చెయ్యి. కాశీనాథ్‌ మరణం కన్నడ చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆయన ద్వారా పైకి ఎదిగిన వాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. శాండల్‌ వుడ్‌ కాశీనాథ్‌కు కన్నీటి అంజలి ఘటించింది. సినిమాల పరంగా చూసుకొంటే.. కాశీనాథ్‌ ది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. ఆ ప్రస్థానానికి మూలం.. అతడికి ఉండిన పరిమితులే!

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలతో పోలిస్తే.. కన్నడ చిత్ర పరిశ్రమ చాలా చాలా చిన్నది. దశాబ్దాలుగా కన్నడనాట పక్కరాష్ట్రాల సినిమాల డ్యామినేషనే కొనసాగుతోంది. తమ రాష్ట్ర పరిధుల్లోని థియేటర్లలో రోజుకు కనీసం ఒక్క షో కన్నడ చిత్రాలనే ప్రదర్శించేలా చట్టం తేవాలని.. కన్నడ చిత్ర పరిశ్రమ పెద్దలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం వారు డిమాండ్లు చేశారు, రోడ్లకు ఎక్కారు. ఇలా దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి.

కానీ.. ఇప్పటికీ.. కన్నడనాట తెలుగు, తమిళ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతూ ఉంది. అలాంటి చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రియేటర్‌ అయినా ఎదగడం చాలా చాలా కష్టం. కన్నడ నాట స్టార్‌ హీరోలు లేరనికాదు, ఎదిగిన వాళ్లంతా.. ఒకటీ రెండు మెరుపులతో ఆరంభించిన వారే. ఆ మెరుపుల అనంతరం వాళ్లు పక్క భాషల సినిమాలపై పడిపోయారు. ఏ తమిళంలోనో, తెలుగులోనో హిట్టైంది అంటే.. ఆ సినిమాను రీమేక్‌ చేసేయడం.. దాన్ని కన్నడ ప్రేక్షకులకు చూపించుకోవడం.

ఇదీ కన్నడ భాష సినిమా సూపర్‌ స్టార్ల రెగ్యులర్‌ యాక్టివిటీ అయ్యింది. విష్ణువర్ధన్‌, అంబరీష్‌, రవిచంద్రన్‌, శివరాజ్‌ కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుదీప్‌... ఇలా ఎవరైతేనేం.. అందరూ అందరే. విష్ణువర్ధన్‌, అంబరీష్‌లు తమ కెరీర్‌ ఆరంభాల్లో కొన్ని గొప్ప సినిమాలు చేశారు. అవి డైరెక్ట్‌ కన్నడ సినిమాలు. అయితే.. వారు ఆ పరంపరను కొనసాగించలేకపోయారు.

తెలుగులో 80లలో హిట్టైన బోలెడు చిత్రాలను విష్ణు, అంబరీష్‌లు రీమేక్‌లు చేశారు. ఇక 90లలోకి వచ్చేసరికి కన్నడ చిత్ర పరిశ్రమ పరిస్థితి పూర్తిగా రీమేక్‌ల మీద ఆధారపడ సాగింది. ఏదో రెండు మూడు సంవత్సరాలకో డైరెక్ట్‌ సినిమా వచ్చి హిట్టుకొడితే అదే గొప్పసంగతి. అలా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న వాళ్లు కూడా.. తమ తదుపరి ప్రయత్నాల్లో రీమేక్‌ల మీదే ఆధారపడిపోతూ.. కొత్తగా చేయడానికి ఏంలేదు.. అన్నట్టుగా తయారయ్యారు. అలాంటి సినీ పరిశ్రమ ప్రస్థానంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. వాళ్లలో కాశీనాథ్‌ ది మొదటిస్థానం. రెండోప్లేస్‌ ఉపేంద్రది అవుతుంది.

ఉపేంద్ర అయినా కొంతకాలం తర్వాత దారి మార్చాడు కానీ.. కాశీనాథ్‌ తన పంథాను వదులుకోలేదు. ఏదో మాస్‌ ఎంటర్‌ టైనర్లు, ఫైట్లు, డ్యూయెట్లతో సినిమాలు చేయడానికి.. కథల కొరత అయితే లేదు. కానీ.. అలాంటి సినిమాలు చేయాలంలే బడ్జెట్‌ ప్రాబ్లమ్‌. ప్రేక్షకులను అలా కట్టిపడేయగల రూపం కూడా తనకులేదు. ఇలాంటి పరిమితుల మధ్య కాశీనాథ్‌ డిఫరెంట్‌ రూట్‌ను ఎంచుకున్నాడు.

ఆంగ్లంలో చెప్పాలంటే.. అవి సాఫ్ట్‌పోర్న్‌ సినిమాలు అనాలేమో. పోర్న్‌ అనేమాట వాటికోసం ఉపయోగించకూడదు. ఏవో కొన్ని సెక్స్‌ సీన్లు అయితే ఉంటాయి. అలాంటి సీన్లు రెగ్యులర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సినిమాల్లో కూడా ఉంటాయి. అయితే కాశీనాథ్‌ సినిమాల్లో మాటల్లో మోటుదనం ఉంటుంది. పల్లెల్లో సాధారణంగా ఉపయోగించే భాషే అది. పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు అయినా, పట్టణాలు, సిటీల్లోంచి వచ్చిన వాళ్లు అయినా.. అలాంటి భాషను రెగ్యులర్‌ గానే యూజ్‌ చేస్తూ ఉంటారు. అయితే.. సినిమాల్లో అలాంటి భాషను పెట్టడమే.. కాశీనాథ్‌ చేసిన సాహసం.

80, 90లలో పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్లకు, ఆ దశకాల్లో టీనేజ్‌లో ఉన్న వాళ్లకు సెక్స్‌ విషయంలో ఎలాంటి దృక్పథం ఉంటుందో... తన సినిమాల్లో పచ్చిగా చూపించాడు కాశీనాథ్‌. ఇప్పుడిలా సెల్‌ఫోన్‌ను టచ్‌చేస్తే పోర్న్‌ మూవీస్‌ వచ్చేసే దశకాలు కావు అవి. సెక్స్‌ కౌన్సిలింగ్‌ కాలమ్స్‌ను చదువుకుని టీనేజర్లు ఆనందపడిపోయిన రోజులు అవి. అలాంటి పరిస్థితుల నడుమ.. సాగే కథలను తన సినిమాలుగా చూపించాడు కాశీనాథ్‌. చాలా బోల్డ్‌ స్టెప్‌ అది.

మలయాళంలో కూడా అదే సమయంలో బోలెడన్ని సెమీపోర్న్‌ సినిమాలు వచ్చాయి. అయితే.. వాటిల్లో ప్రధానంగా సెక్స్‌ను చూపించాలనే తాపత్రమయే ఉంటుంది. బెడ్రూమ్‌ సీన్లే వాటికి ఆయువు పట్టు. అయితే కాశీనాథ్‌ సినిమాలు అలాకాదు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌.. వాటిని డబుల్‌ మీనింగ్‌ అనడానికి కూడాలేదు.. సెక్స్‌ సంబంధిత ఎక్స్‌ ప్రెషన్లను మరీ పచ్చిగా కాకుండా.. కాస్త డిప్లొమాటిక్‌గా చెప్పడం అనాలేమో.

అనుభవం, వింత శోభనం, చోర్‌ గురూ చండ్‌ శిష్యా, భూలోకంలో రంభ ఊర్వశి మేనక, సుందరాంగుడు... ఇవీ కాశీనాథ్‌ కన్నడలో తీసిన సినిమాల తెలుగు అనువాదపు టైటిల్స్‌. వీటి పేర్లను వింటే కొంతమంది బుగ్గలు నొక్కుకోవచ్చు. వీటిల్లో కంటెంట్‌ను చూసి కొందరు జీర్ణించుకోలేకపోవచ్చు. ప్రత్యేకించి 1984లో కన్నడలో వచ్చిన 'అనుభవ' సినిమా.. నాటి పరిస్థితులకు దర్పణం అనాలి. అప్పుడే టీనేజ్‌లోకి వచ్చిన ఒక పాప పెద్ద మనిషి కావడం దగ్గర నుంచి ఆ సినిమా కథ ప్రారంభం అవుతుంది. 

కానీ.. ఏమీ తెలియని ఆ అమాయకురాలు.. తమ్ముడితో కలిసి ఆడే ఆటలు, అంతలోనే ఆమెకు పెళ్లికావడం, భర్త పాత్ర(కాశీనాథ్‌) తన బట్టలు విప్పుతున్నాడని అతడికి దూరదూరంగా నడుచుకోవడం.. అమాయకత్వమే మరేం లేదు. 80లలో గ్రామీణ భారతంలో చదువుకోని కుటుంబాల మధ్య పెరిగిన పిల్లల్లో అలాంటి భావనలు ఏ మాత్రం అసహజం కాదు. 'అనుభవ' సినిమాను తెలుగులోకి 'అనుభవం'గా డబ్‌ చేశారు. దానికి సెన్సార్‌ బోర్డు 'ఏ' సర్టిఫికెట్‌ ఇచ్చింది.

కానీ.. అప్పటి పరిస్థితుల్లో గ్రామాల్లో పుట్టి పెరిగిన వారికి.. ఆ సినిమా అత్యంత సహజం అనిపిస్తుంది. అప్పటి వరకూ ఎందుకు? ఈ రోజుల్లో 'బతుకు జట్కాబండి', 'రచ్చబండ' వంటి చోట్లకు వస్తున్న పంచాయితీలను, వాటిల్లో వాళ్లు వ్యక్తం చేసే సమస్యలను బట్టి గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వారి జీవితాల్లోని పెళ్లిళ్లు, అక్రమసంబంధాల తీరు.. ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి చోట్ల వ్యక్తం అవుతున్న సమస్యల చుట్టూ అల్లిన తరహా కథలే.. కాశీనాథ్‌ సినిమాలు. కాబట్టి వాటిని బూతు.. అని ఒక గాటన కట్టేసి వదిలిపెట్టలేం.

సెక్స్‌.. మనిషిలోని బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌. సెక్స్‌ విషయంలో చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులతో ఏర్పడే ఫీలింగ్స్‌ను ఒక్కోరు ఒక్కోలా చూస్తారు. అలాంటి కాన్సెప్ట్స్‌ను వైవిధ్యంగా సినిమాల్లోకి తీసుకొచ్చాడు కాశీనాథ్‌. బడ్జెట్‌ విషయంలో, నటీనటుల విషయంలో, కథల విషయంలో, తనరూపం విషయంలో తనకున్న పరిమితుల మేరకే నడుచుకొంటూ కల్ట్‌ క్లాసిక్స్‌ అనదగ్గ సినిమాలను తీశాడాయన. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కాశీనాథ్‌ శిష్యుడే. కాశీనాథ్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమాల్లో చోటామోటా పాత్రలు కూడా చేశాడు ఉప్పీ. కాశీనాథ్‌కు నిఖార్సైన శిష్యుడు ఉప్పీ.

తనకున్న పరిమితుల్లోనే కల్ట్‌ క్లాసిక్స్‌ను తీసి చూపించాడు కాశీనాథ్‌. ఉప్పీకి కూడా అలాంటి పరిమితులే. ఇతడు గురువు కన్నా కాస్త డిఫరెంట్‌ రూట్‌ను ఎంచుకుని.. మనిషిలోని మృగత్వాన్ని రెప్రజెంట్‌ చేసే సినిమాలు తీసి చూపించాడు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో.. ఒక భారతి రాజా, ఒక బాలచందర్‌, మరో దాసరి... ఇలా ఎవరి మార్కు సినిమాలు వారివి అనుకుంటే.. వీరికి స్థాయికి ఏమాత్రం తీసిపోని దర్శకుడు కాశీనాథ్‌. అయితే ఇతర స్టార్‌ దర్శకులకు వచ్చినంత గుర్తింపు ఆయనకు రాలేదంతే!