నందమూరి ఫ్యామిలీలో కీలకమైన బాలకృష్ణ-హరికృష్ణల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అని గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ కారణంగా బాలయ్యకు హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య కూడా దూరం పెరిగిందని గుసగుసలు వినిపించాయి. వాటికి తగినట్లుగానే హరికృష్ణకు, ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ అంతంతమాత్రమై పోయింది.
రాను రాను బాబాయ్ అబ్బాయ్ ల నడుమ గ్యాప్ పెరిగిందని ఇండస్ట్రీలో, పొలిటికల్ సర్కిళ్లలో తరచు వినిపిస్తూనే వచ్చింది. బాబాయ్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ, లుక్కుల గురించి కానీ ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా ఎప్పుడూ వేయలేదు.
సరే, ఇంతలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. నందమూరి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. వెంటనే చంద్రబాబునాయుడు, లోకేష్, బాలయ్య అందరూ ఎన్టీఆర్ తో కలిసారు. దాదాపు వారంరోజులు కలిసే వున్నారు. వాళ్లంతా కలిసి ముచ్చటించుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి.
దీంతో ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా అరవింద సమేత వీరరాఘవ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు బాబాయ్ బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినవచ్చాయి. అంతేకాదు, ఫంక్షన్ ఆంధ్రలో వుండే అవకాశం వుందనీ వార్తలు వచ్చాయి. కానీ మరి ఏమయిందో? పరిస్థితి మళ్లీ మామూలు అయినట్లు తెలుస్తోంది.
అరవింద అడియో పంక్షన్ లో విపరీతంగా ఎమోషనల్ అయిన ఎన్టీఆర్ తన ప్రసంగంలో పొరపాటున కూడా బాలయ్య పేరు కానీ బాబు పేరు కానీ ప్రస్తావించలేదు. తండ్రి మరణం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ నే తనకు అన్నివిధాలా అండగా వున్నారని, సోల్ మేట్ అని చెప్పుకువచ్చారు. బాలయ్య బాబాయ్, చంద్రం మామ గురించి మాట మాత్రానికైనా ప్రస్తావించలేదు.
అలాగే కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ పుట్టెడు దుఖంలో వుండి కూడా అరవింద ఫినిష్ చేసారు అని చెప్పారు కానీ తాను కూడా బయోపిక్ షూట్ కు వెళ్లానని చెప్పలేదు. సరే, అరవింద ఫంక్షన్ కాబట్టి, బాలయ్య, బాబు, బయోపిక్ ప్రస్తావనలు చేయలేదని అనుకోవచ్చు.
మరి ఇంతకీ బయోపిక్ మీద ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ అయినా వేసారా? ఇంతకు ముందుసరే, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లుక్ మీద, టైటిల్ మీద, రెండుభాగాలు అనే విషయం మీద ఓ క్లారిటీ వచ్చింది కదా? మరి అన్నదమ్ములు ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం ఏమిటో?
అలా అని ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ వాడడం లేదా అంటే చరణ్ కు, మహేష్ బాబుకు విషెష్ చెబుతున్నారు. ఇంకా తన స్పందనలు తెలియచేస్తున్నారు ఒక్క బయోపిక్ విషయంలో తప్ప. ఇదంతా చూస్తుంటే బాబాయ్, అబ్బాయిలు మనుషులు కలిసినా, మనసులు ఇంకా కలవలేదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.