ఎన్టీఆర్ గా బాలయ్య లుక్ ఓకే

మనిషిని పోలిన మనుషులు వుంటారు. కానీ అరుదుగా వుంటారు. ఎంత కొడుకులైనా, మనవలైనా ఎక్కడో అచ్చుగుద్దినట్లు దిగిపోయేవారు తక్కువ. నందమూరి తారకరామారావు విగ్రహం వేరు. ఆ రూపం వేరు. అందులో కనిపించే ఆకర్షణ, ఠీవి…

మనిషిని పోలిన మనుషులు వుంటారు. కానీ అరుదుగా వుంటారు. ఎంత కొడుకులైనా, మనవలైనా ఎక్కడో అచ్చుగుద్దినట్లు దిగిపోయేవారు తక్కువ. నందమూరి తారకరామారావు విగ్రహం వేరు. ఆ రూపం వేరు. అందులో కనిపించే ఆకర్షణ, ఠీవి వేరు. అది అందరికీ వచ్చేదికాదు. అందువల్ల అచ్చంగా ఆయనలాగే వుండాలంటే కుదిరే పనికాదు.

ఇక ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య విషయానికి వస్తే ఎన్టీఆర్ అంత పొడగరికాదు. శరీరపు కొలతల్లో చాలాతేడా వుంది. పైగా మొహంలో నోరు, ముక్కు కాస్త తేడా వుంటుంది. అందువల్ల ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఎలా వుంటాడో అన్న సందేహాలు అయితే వున్నాయి. కానీ ఈ రోజు ఫస్ట్ లుక్ వరకు చూసుకుంటే, చాలావరకు ఆ సందేహాలన్నీ తీరినట్లే. లుక్ వరకు 90శాతం బాగానే కారీ చేయగలిగారు. ముఖ్యంగా కళ్లజోడు పెట్టి, హెయిర్ స్టయిల్ సెట్ చేయడంలో చాలావరకు కవర్ చేసేయగలిగారు.

నోరు దగ్గర కొద్దిగా తేడా అనిపిస్తుంది ఎన్టీఆర్-బాలయ్య ఎన్టీఆర్ ఫోటోలు పక్క పక్కన పెడితే. ఇక ఎప్పుడైతే జనాలకు చిరపరిచితమైన కాషాయం కట్టేసారో, ఎన్టీఆర్ కళ్ల ముందుకు వచ్చినట్లయింది. ఇక మిగిలింది సినిమాలో పెర్ ఫార్మ్ చేయడం. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా నడక, చూపు, ఆ ఠీవి తీసుకురాగలిగితే, బాలయ్య సక్సెస్ అయిపోయినట్లే.

ఏమైనా తేజ వెళ్లిపోయి, క్రిష్ డైరక్టర్ గా రావడం, మహానటి సినిమా విడుదల కావడం ఈ రెండూ ఎన్టీఆర్ బయోపిక్ కు కలిసి వచ్చిన అంశాలుగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా తేజనే డైరక్టర్ గా వుండి వుంటే, ఈ తరహా లుక్ సినిమాకు వచ్చి వుండేది కాదని అభిమానుల మాట.