తెలుగు సినిమా హీరోల తీరు మారుతోంది. హీరో అంటే అన్నిట్లోను గొప్పగానే వుండాలన్నట్టుగా మన దర్శకుల ఆలోచనా తీరు వుండేది. ముఖ్యంగా స్టార్ హీరోల దగ్గరకి వచ్చేసరికి వారిని ఏదైనా లోపంతో చూపించడానికి డైరెక్టర్లు ఇష్టపడేవాళ్లు కాదు. ఏదైనా కొత్త రకం పాత్ర అయినా, ప్రయోగం అయినా తమిళ హీరోలు చేస్తే చూడాల్సిందే తప్ప మనవాళ్లు ఆ భాగ్యం కలిగించే వారు కాదు.
కానీ ఇప్పుడు మన హీరోలు కూడా ప్రయోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. దర్శకులు కూడా కంఫర్ట్ జోన్లోంచి బయటకి వస్తున్నారు. హీరోలంటే అన్నిట్లోను పర్ఫెక్ట్గా వుండాల్సిన పని లేదని అంటున్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో వున్న మూడు భారీ చిత్రాల్లో హీరోకి ఏదో ఒక వైకల్యం వుంది. 'జై లవకుశ'లో ఎన్టీఆర్ పోషిస్తోన్న విలన్ పాత్రకి నత్తి వుంది. టీజర్లో ఈ ఎలిమెంట్ రివీల్ చేయడంతో ఈ పాత్రపై మరింత ఆసక్తి కలిగింది.
అలాగే సుకుమార్ డైరెక్షన్లో చరణ్ చేస్తోన్న చిత్రంలో అతనికి వినికిడి లోపం వున్నట్టు, ఆ కారణంగా కొన్నిసార్లు దుడుకుగా వ్యవహరిస్తాడన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని సుకుమార్, చరణ్ ఇద్దరూ ఖండించలేదు, సమర్ధించలేదు కానీ ఇది వాస్తవమేనని ఇన్సైడర్స్ టాక్.
ఇక రవితేజ 'రాజా ది గ్రేట్' చిత్రంలో అంధుడిగా కనిపించబోతున్నాడు. మారుతోన్న ఆలోచనా సరళితో మన హీరోలు ఇకపై మనకి కొత్తరకం సినిమా వినోదం అందిస్తారని ఖాయం చేసుకోవచ్చు.