రాజమౌళితో సినిమా పూర్తయిన వెంటనే కొరటాల దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందని స్వయంగా ఎన్టీఆర్ గతంలో ప్రకటించాడు. జనతాగ్యారేజ్ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన కొరటాలతో వెంటనే ఇంకో సినిమా చేస్తానని అప్పట్లోనే ప్రకటించాడు. కానీ ఇప్పుడా ఆలోచన నుంచి బయటకొచ్చినట్టున్నాడు ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా తర్వాత వెంటనే కొరటాలకు అవకాశం ఇవ్వడంలేదు.
కేజీఎఫ్ లాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తో కథాచర్చలు జరుపుతున్నాడు ఎన్టీఆర్. స్టోరీ ఓకే అయితే మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక-హాసిని బ్యానర్ పై మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్.
ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. అప్పటికి ప్రశాంత్ నీల్ రెడీగా ఉంటే అతడి సినిమాను కూడా కాల్షీట్లు ఇస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాతే కొరటాల శివతో మూవీ గురించి ఆలోచిస్తాడు. సో.. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో సినిమా కోసం కనీసం మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదేమో.
నిజానికి ఈ విషయంలో ఎన్టీఆర్ ది తప్పులేదు. లెక్కప్రకారం చూసుకుంటే కొరటాల శివ, రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. సరిగ్గా ఇక్కడే సమీకరణాలు మారాయి. మధ్యలో చిరంజీవి ఎంటర్ అయ్యారు. మూవీ లాక్ అయింది.
చిరంజీవితో వ్యవహారం అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అలా దాదాపు ఏడాదిగా మెగాఫోన్ కు దూరమయ్యాడు కొరటాల. అందుకే ఎన్టీఆర్ ఇతర ఆప్షన్ల వైపు వెళ్లాల్సి వచ్చింది.