హీరో ఎన్టీఆర్ కు ఓ సమస్య వచ్చింది. మరీ పెద్ద సమస్య కాదు. చిన్నదే. జనం ముందుకు రావాలా? వద్దా? ఇదే సమస్య. జనం ముందుకు రావడానికి అంత సమస్య ఏముంటుంది? అనుకోవద్దు.
ప్రస్తుతం బాడీ షేపప్ తో, మాంచి లుక్ సంతరించుకునే పనిలో వున్నాడు ఎన్టీఆర్. ఇదంతా త్రివిక్రమ్ ఇంకా రాజమౌళి సినిమాల కోసం. ఈ లుక్ ను కొన్నాళ్లు కాస్త సస్పెన్స్ లో వుంచాల్సిన అవసరం వుంది.
కానీ ఈలోగా పబ్లిక్ లోకి రావాల్సిన అవసరం వుంది. సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎమ్ఎల్ఎ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 17న ప్లాన్ చేసారు. ఆ సినిమాకు బజ్ తీసుకురావడంలో నిర్మాతలు అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా మరో పది రోజుల్లోకి వచ్చేసింది కానీ, ఇంకా రావాల్సినంతగా జనంలోకి రాలేదు.
సినిమా మార్కెటింగ్ తో సమస్య లేదు. అమ్మకాలు అయిపోయాయి. లాభాలు వచ్చేసాయి. కానీ సినిమాకు మాంచి ఓపెనింగ్స్, ఆపైన రన్నింగ్ రావాలికదా? అలా కావాలంటే సినిమాకు మరింత బజ్ రావాలి.
పైగా 23న కాంపిటీషన్ కూడా కాస్త గట్టిగానే వుంది. మరి ఇలాంటపుడు ఎన్టీఆర్ నే శరణ్యం. ఒక్కసారి ఎన్టీఆర్ గానీ అలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోకి వచ్చారంటే చాలు, ఎమ్మెల్యే సినిమా బజ్ అమాంతం పెరుగుతుంది.
కానీ అలా వస్తే, లుక్ రివీల్ అయిపోతుంది. అదీ సమస్య. మరి ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.