మొత్తానికి ఈసారి దసరా సీజన్ చాలా హాట్ గా మారిపోతోంది. ఏ హీరో కి ఆ హీరో ప్రెస్టీజియస్ గా ఫీలయ్యే పరిస్థితులు దాపురించాయి. దీంతో ఏ సినిమా కూడా వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కానీ దీనివల్ల కలెక్షన్లు చీలిపోవడం, థియేటర్లు దొరక్క పోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పైగా సంక్రాంతి అంతటి పెద్ద సీజన్ కాదు దసరా. వర్షాల ప్రమాదం, పొలం పనులు, ఇతరత్రా వ్యవహారాలు చాలా వుంటాయి ఇక్కడ. అందువల్ల మహా అయితే రెండేసి వారాల గ్యాప్ తో ఒక్కో పెద్ద సినిమాకు అవకాశం వుంటుంది. కానీ ఇక్కడ జస్ట్ పది రోజుల్లో మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి.
ముందుగా చెప్పింది మేమే
సినిమాకు క్లాప్ కొట్టకముందే డేట్ ప్రకటించారు బాలయ్య-పూరి సినిమా నిర్మాత. అందువల్ల వాళ్లది ఎంత మాత్రం తప్పు లేదు. డేట్ ప్రకటించి, ఆ మేరకు రెడీ అవుతున్నాం అని, ఇప్పుడు ఎవరో వస్తారని, ముందుకో, వెనక్కో జరిగే ప్రసక్తే లేదని ఆ సినిమా యూనిట్ అంటోంది.
మహేష్ ప్రకటించారు
దసరాకు వస్తున్నాం అని సూపర్ స్టార్ మహేష్ బాబే ప్రకటించారు నెల రోజులు ముందుగానే. ఆ మేరకు షెడ్యూలుతో పాటు థియేటర్ల బుకింగ్ కూడా అప్పుడే ప్రారంభించేసారు స్పైడర్ సినిమా కోసం. స్పైడర్ నిర్మాతల్లో ఒకరైన ఎన్ వి ప్రసాద్ కు సీడెడ్ లో థియేటర్ల సమస్య లేదు.
అలాగే నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఆశియన్ సునీల్ థియేటర్లు చాలా వరకు మహేష్ సినిమా కోసం రిజర్వ్ చేసారు. అందువల్ల అక్కడా సమస్య లేదు. ఇక ఆంధ్రలో గీతా థియేటర్లు కూడా స్పైడర్ కోసం ఫిక్స్ చేసారు. సో, డేట్ మార్చుకునే అవకాశం లేదు 27నే స్పైడర్ ఫిక్స్
ఎన్టీఆర్ కే సమస్య
నిజానికి ఎన్టీఆర్ సినిమా ఆగస్టు ఆఖరివారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనుకున్నారు. కానీ పనులు తెగక, వెనక్కు జరగక తప్పలేదు. అయితే ఎన్టీఆర్ సినిమా ఇంకా అమ్మకాలు ప్రారంభించలేదు. భారీ రేట్లు చెబుతున్నారు. ఆంధ్రనే 35 నుంచి 40 రేషియోలో చెబుతున్నారు.
ఎప్పుడైతే విడుదలైన వారంలో, మరో రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయో, అంత రేట్లు గిట్టుబాటు కాదని బయ్యర్లు బేరాలాడే పరిస్థితి వుంటుంది. అందువల్ల రేటు కావాలి అంటే వన్ వీక్ ముందుకు రావడం లేదా, దీపావళికి రావడం బెటర్ అని బయ్యర్ల వర్గాలు పేర్కొంటున్నాయి.
సినిమా సేల్స్ అన్నది భవ్యకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అవసరం అయితే నేరుగా విడుదల చేసుకుంటారు. ఎన్టీఆర్, మహేష్ సినిమాలతో పోల్చుకుంటే భయంకరమైన అమౌంట్ కాదు. కానీ ఈ రెండూ కూడా 100కోట్లకు పైగా వసూళ్లు సాదించాల్సిన సినిమాలు.
అందువల్ల ఇప్పుడు బయ్యర్ల ప్రెజర్ అంతా ఎన్టీఆర్ సినిమా మీదకు మళ్లే అవకాశం వుంది. కానీ వన్స్ డేట్ ప్రకటించి, వెనక్కు తగ్గితే, హీరో అభిమానుల ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లు వుంటుంది. అందువల్ల ముగ్గురూ ముగ్గురే.. ఎవరూ తగ్గరు. నిర్మాతలకే ఇబ్బంది తప్పదు.