ఒకరేమో సూపర్ హిట్ హీరో. మరొకరు సూపర్ హిట్ దర్శకుడు. వీళ్లిద్దరూ కలిస్తే కమర్షియల్ ఎంటర్ టైనర్ గ్యారెంటీ. కానీ ఎన్టీఆర్ మాత్రం రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. అటు త్రివిక్రమ్ కూడా తన జానర్ నుంచి కాస్త పక్కకు వద్దామని చూస్తున్నాడు. అలా ఇద్దరూ కలిసి ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు.
అవును.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుందట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటివరకు తను టచ్ చేయని జానర్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు చేయని పాత్ర చేస్తున్నాడు. అదే పొలిటికల్ థ్రిల్లర్. తారక్-త్రివిక్రమ్ కాంబోలో ఓ పొలిటికల్ బేస్డ్ మూవీ రాబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం జైలవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. అటు పవన్ కల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఇద్దరూ కథాచర్చల్లో కూర్చుంటారు. అప్పుడు ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై ఓ క్లారిటీ వస్తుంది. అయితే ఎన్నికల టైమ్ లో ఎన్టీఆర్ పొలిటికల్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంటాడా అనేది డౌట్.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఎన్టీఆర్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన తారక్, ఇప్పుడు మాత్రం ఆ పార్టీతో, పెద్దలతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పొలిటికల్ సబ్జెక్ట్ తో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తే కచ్చితంగా అది అతడి రాజకీయ రీ ఎంట్రీపై ఊహాగానాలకు అవకాశం ఇస్తుంది. తారక్-త్రివిక్రమ్ సినిమా 2018 మిడ్ లో రిలీజ్ అవుతుంది.