హీరో నితిన్ నిర్మాతగా మారాడు. అఖిల్ తో వివి వినాయక్ డైరక్షన్ లో భారీ సినిమా నిర్మించాడు. ఇది, బాగానే వుందా..కంటిన్యూ చేస్తారా..అంటే అమ్మోయ్ అనేస్తున్నాడు. ఈ పాయింట్ హీరోలంతా గమనించాలి.
ఇంట్లో తండ్రి సుధాకర రెడ్డి నిర్మాత. ఇప్పుడు స్వయంగా నితిన్ నిర్మాత. అయినా నిర్మాణ మంటే బాబోయ్ అన్నాడు అంటే, సినిమా నిర్మాణంలో ఎన్ని సాధక బాధకాలు వున్నాయో అర్థం అవుతోంది కదా. దీన్ని గమనించి అయినా హీరోలు నిర్మాతల సమస్యలు పట్టించుకుని వారికి కోపరేటివ్ గా వుండాలి.
లేదూ అంటే మహేష్ మాదిరిగా తన ప్రాజెక్టుల్లో పార్టనర్ లుగా మారిపోవాలి. దాని వల్ల వీళ్లకీ లాభం, సినిమాను చాలా జాగ్రత్తగా, ప్రమోట్ చేసుకుంటారు. స్వంత సినిమా కాకపోతే అలా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తారా..అంత టైమ్ కేటాయిస్తారా? పైగా అంతకు అంతా ప్రతిఫలం వుంటుంది కాబట్టి, అలా చేయడమే మంచింది.
ఆ మధ్య సీనియర్ నటి విజయనిర్మల ఓ మాట అన్నారు..హీరో కృష్ణగారు, రెమ్యూనిరేషన్ పార్ట్ అందలేదని డబ్బింగ్ చెప్పనంటూ మొరాయించిన వైనం లేదు అని. ఆయన అంతగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా వుండేవారు.
కానీ ఇప్పుడు హీరోలు, తేడా వస్తే నిర్మాతలకు నరకం చూపించేస్తున్నారు. నిర్మాతల సమస్యలు అర్థం కావాలంటే ప్రతి హీరో ఒక్క సినిమా అయినా తీస్తే తెలుస్తుంది. ఇప్పటికే అల్లరి నరేష్, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లకు తెలిసింది నిర్మాణం ఎంత కష్టమో, ఎంత రిస్క్ అన్నదో. నితిన్ కు కూడా అలాగే తెలిసి వచ్చి వుంటుంది.