సినిమా రంగంలో అంతా మాట మీదే వుంటుంది. పేరుకు అగ్రిమెంట్ లు వుంటాయి తప్ప వాటినేం బ్రహ్మాస్త్రాలుగా వాడరు. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ నో, లేదా రిటర్నబుల్ అడ్వాన్స్ గానో సినిమా ఇస్తే ఓ సమస్య.
సినిమా కలెక్షన్లకు ఇచ్చిన అడ్వాన్స్ కు సరిపోతే ఓకె. మాంచి లాభాలు వస్తే మాత్రం ఓవర్ ఫ్లోస్ వసూలు వరకూ ఫోన్లు చేస్తూ వుండాల్సిందే. అలా అని బయ్యర్లకూ తలనొప్పి వుంటుంది. సినిమా తేడా వస్తే రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చినా వెనక్కు రావు. తరువాత సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే.
ఓ పెద్ద బ్యానర్ నుంచి దాదాపు ఏడాది అయిపోతోంది ఓ సినిమా వచ్చి. పెద్ద హిట్ నే అయింది. అన్ని చోట్ల బాగానే డబ్బులు వచ్చాయి. అలాగే ఓవర్ సీస్ లో కూడా. కానీ ఇప్పటికి ఓవర్ ఫ్లోస్ రాలేదట. సినిమాను తీసుకున్న ఓవర్ సీస్ బయ్యర్ తాను ఇచ్చిన అడ్వాన్స్ పోగా మిగిలిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదట. దాంతో సదరు నిర్మాత ఈ డిస్ట్రిబ్యూటర్ మీద కారాలు, మిరియాలు నూరుతున్నారట.
అదే బయ్యర్ మరో హిట్ సినిమాకు ఓవర్ ఫ్లోస్ ఇవ్వకపోయినా, చిన్న నిర్మాత కావడంతో ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఈ నిర్మాత మాత్రం కాస్త పెద్ద నిర్మాత కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ మాట కు ఆ మాట డిస్ట్రిబ్యూటర్ కు బాధలే. పది సినిమాలు చేస్తే రెండు సినిమాలు హిట్ అయినపుడు, ఎనిమిది సినిమాల్లో డబ్బులు పోయినపుడు ఎక్కడ నుంచి అడ్జస్ట్ చేస్తారు. ఇటు లాభాలు అటు నష్టాలకు మళ్లించాల్సిందే.