పాటేస్కుంటే పబ్లిసిటీ కిక్కే కిక్కు.!

ఓ పాటేస్కుంటే పోలా.? ఇదీ టాలీవుడ్‌లో నడుస్తోన్న న్యూ ట్రెండ్‌. హీరో, హీరోయిన్‌.. ఇలా ఈ మధ్య పాటలు పాడేస్తూ ఆయా సినిమాలకి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు. తెలుగులో మాట్లాడలేకపోతున్నా, తెలుగులో ఎంచక్కా పాటలు…

ఓ పాటేస్కుంటే పోలా.? ఇదీ టాలీవుడ్‌లో నడుస్తోన్న న్యూ ట్రెండ్‌. హీరో, హీరోయిన్‌.. ఇలా ఈ మధ్య పాటలు పాడేస్తూ ఆయా సినిమాలకి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు. తెలుగులో మాట్లాడలేకపోతున్నా, తెలుగులో ఎంచక్కా పాటలు పాడేస్తున్నారు రాశి ఖన్నా తదితర ముద్దుగుమ్మలు. ఆ పాటల ద్వారా సినిమాపై క్రేజ్‌ పెరుగుతుండడంతో సంగీత దర్శకులు హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.. దర్శక నిర్మాతలు 'సై' అంటున్నారు హీరో మీరోయిన్లతో పాటు పాడించే విషయమై.

పాత కాలంలో అయితే హీరో హీరోయిన్లు తమంతట తాముగా పాటలు పాడేవారు. అదో ట్రెండ్‌. మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్టులుండేవారు అప్పట్లో. సొంత డబ్బింగ్‌, సొంతంగా పాటలు పాడుకోవడం.. అప్పుడో ప్రత్యేకత. ఆ తర్వాత కాలం మారింది. డబ్బింగ్‌ చెప్పుకోవడం మానేశారు హీరో హీరోయిన్లు. హీరోయిన్లయితే మరీనూ. తెలుగులో మాట్లాడటం వచ్చినా, డబ్బింగ్‌కి అంత సమయం కేటాయించడమెందుకు.? అన్న నిర్లక్ష్యంతో డబ్బింగ్‌ ఆలోచనను పక్కన పడేశారు.

Watch Lakshmi Manchu Singing Video

ఇప్పుడలా కాదు. పాత ట్రెండ్‌ రిపీట్‌ అవుతోందని అనలేంగానీ, ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా మారిపోయింది. మెగాస్టార్‌ చిరంజీవి 'మాస్టర్‌' సినిమాలో ఓ పాటేసుకున్నారు. ఈ మధ్యకాలంలో అయితే, చాలామంది హీరోలు, హీరోయిన్లు పాటలు పాడేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ ఎప్పటినుంచో గాత్రమ్మీద మమకారంతో పాటలు పాడుతూనే వున్నాడు.

ఎన్టీఆర్‌ 'అదుర్స్‌' సినిమాలోనూ, ఇటీవలే వచ్చిన 'రభస' సినిమాలోనూ పాటేసుకున్నాడు. మంచు ఫ్యామిలీ నుంచి దాదాపు అందరూ పాటలు పాడేశారు. లేటెస్ట్‌గా మంచు లక్ష్మి పాటేసుకుని, 'దొంగాట' సినిమాకి వీర పబ్లిసిటీ తెచ్చేయడం గమనార్హం. మమతా మోహన్‌దాస్‌, నటిగా కన్నా సింగర్‌గానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందనడం అతిశయోక్తి కాకపోవచ్చు. నిత్యా మీనన్‌ ఓన్‌ డబ్బింగ్‌, ఓన్‌ సింగింగ్‌తో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. రాశి ఖన్నా 'జోరు' సినిమాలోని జోరు జోరుగా పాట పాడేసి ఓ రేంజ్‌లో కిక్కెక్కించింది.

మొత్తమ్మీద, ఏదన్నా సినిమా వస్తోందంటే, ఆ సినిమాలో హీరో పాటేస్కున్నాడా? హీరోయిన్‌ పాటేస్కుందా.? అని అనుకోవాల్సి వస్తోంది. ఆ రేంజ్‌లో పాట మీద నటీనటులు మమకారం చూపిస్తున్నారన్నమాట. ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్‌ బాసూ.!