ఒక్కోసారి ఒక్కో నిర్ణయం భలేగా పీకకు చుట్టుకుంటుంది. అల్లుడు శ్రీను సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని, భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం, ఇప్పుడు అతగాడి కెరీర్ తో ఆడుకుంటోంది. ఆ సినిమాను పక్కన పెట్టి సరైనోడు సినిమా చేయడానికే చాలా కిందామీదా పడాల్సి వచ్చింది.
లక్కీగా అప్పట్లో బెల్లంకొండ సురేష్ కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో వుండడంతో, కాస్త వెసలుబాటు దొరికింది. కానీ సరైనోడు తరువాత తన కొడుకు సినిమా చేసి తీరాల్సిందే అని బెల్లంకొండ పట్టుబట్టడంతో, ఇక తప్పలేదు. కానీ దానికి సరైన కథ బోయపాటి దగ్గర లేదన్నది వాస్తవం. అందుకోసం సరైనోడు విడుదల దగ్గర నుంచి కిందా మీదా కసరత్తులు చేస్తున్నారు.
కానీ సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మరో పెద్ద హీరోతో సినిమా చేసే చాన్స్ అయితే బోయపాటికి మిస్ అయిపోయింది. ఈ కమిట్ మెంట్ కారణంగానే బాలయ్య బాబు వందో సినిమా కాస్తా చేజారిపోయింది. అలాగే జనతా గ్యారేజ్ తరువాత సరైన, భారీ డైరక్టర్ కోసం ఎన్టీఆర్ చుట్టూ చూస్తున్నారు. బోయపాటి వున్నా కూడా, పాపం ఈ బెల్లంకొండ అడ్డుగా వుండిపోయింది. లేదూ అంటే, ఈపాటికి బోయపాటి-ఎన్టీఆర్ కాంబినేషన్ అనౌన్స్ అయిపోయేది.
ఇప్పటికి ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా స్టార్టింగ్ స్టేజ్ లోనే వుంది. అది ఎప్పటికి పూర్తవుతుందో, మళ్లీ బోయపాటి భారీ సినిమాకు ఎప్పుడు శ్రీకారం చుడతారో?