విఐపి అంటే మన సినిమా కామన్ ప్రేక్షకులకు తెలియదు. అదే రఘువరన్ బిటెక్ అంటే ఇట్టే పట్టేస్తారు. తమిళనాట విఐపి గా తెలుగునాట రఘువరన్ బిటెక్ గా సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమాకు విఐపి 2గా సీక్వెల్ తీసారు. బాలీవుడ్ నటి కాజోల్ కూడా వుండడంతో, తెలుగునాట రఘువరన్ పెద్ద హిట్ కావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. దాంతో చాలా మంది ఆ సినిమాను తెలుగు హక్కులు కొనాలని ప్రయత్నించారు.
దాంతో తమిళ వెర్షన్ నిర్మాతలు కొండెక్కి కూర్చున్నారు. 12కోట్లకు పైన అయితేనే మాట్లాడేది. లేదంటే లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. 12కోట్లకు ఫస్ట్ కాపీ కొని, మిగిలిన ఖర్చులు అన్నీ పెట్టుకుని విడుదల చేయడం అంటే కనీసం 16కోట్ల రేంజ్ లో అమ్మాల్సి వుంటుందని, చాలా మంది వెనకడుగు వేసారు. పైగా విఐపి 2 అని టైటిల్ పెట్టే కన్నా, రఘువరన్ 2 అనో రఘువరన్ ఎమ్ టెక్ అనో వుంటే వేరే సంగతి.
ఇంతకీ ఇప్పుడేమయింది. తమిళ నాట విడుదలయింది. నెగిటివ్ సమీక్షలు వచ్చాయి. కలెక్షన్లు ఫస్ట్ వీకెండ్ బాగానే వున్నాయి. కానీ ఆ పై ఎలా వుంటాయో తెలియదు. దాంతో ఎవరూ కొనేందుకు ముందుకు వెళ్లలేదు. తమిళ నిర్మాతలే తెలుగు నాట కూడా విడుదల చేసుకుంటున్నారు.