జంక్షన్ లో జనసేనాని: వాట్ నెక్ట్స్

భారీ అంచనాల మధ్య చేసిన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయింది.  మరెన్నో ఊహాగానాల మధ్య చేసిన అనంత పర్యటన ముగిసింది. మళ్లీ జంక్షన్ వద్దకు చేరిన పవన్.. జనసేనానికి దారేది? Advertisement అనంత పర్యటన…

భారీ అంచనాల మధ్య చేసిన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయింది. 
మరెన్నో ఊహాగానాల మధ్య చేసిన అనంత పర్యటన ముగిసింది.
మళ్లీ జంక్షన్ వద్దకు చేరిన పవన్.. జనసేనానికి దారేది?

అనంత పర్యటన ముగిసిన తర్వాత మరోసారి ఖాళీ అయిపోయాడు పవన్ కల్యాణ్. మరి ఈసారి అతడు ఏం చేయబోతున్నాడు. ఎప్పట్లానే ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకెళ్తాడా..? లేక జనసేన జెండా పట్టుకొని పూర్తిస్థాయిలో జనాల్లోకి వస్తాడా..? ఈ డిస్కషన్ పాతదే. అజ్ఞాతవాసికి ముందు నుంచి ఉన్నదే. కాకపోతే ఇప్పుడు మళ్లీ ఫ్రెష్ గా మొదలైంది.

నిజంగా అజ్ఞాతవాసి బ్లాక్ బస్టర్ అయితే పవన్ సినిమాల నుంచి తప్పుకునేవాడేమో. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇలాంటి డిజాస్టర్ మూవీతో కెరీర్ ముగించడం మంచిది కాదని ఇప్పటికే పవన్ కు సూచనలు అందాయి. పవన్ మనసులో కూడా అదే ఉంది.

ప్రస్తుతం తన మైండ్ లో సినిమా ఆలోచన లేదన్నాడు పవన్. కానీ అతడి సన్నిహితుల నుంచి వస్తున్న లీకులు చూస్తుంటే మాత్రం మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ కు పవన్ అడ్వాన్స్ ఇంకా వెనక్కి ఇవ్వలేదట. అటు ఏఎం రత్నం కూడా పవన్ ను తరచుగా కలుస్తూనే ఉన్నాడట.

ఇక రాజకీయంగా చూసుకుంటే జనసేన పరిస్థితి ఏంటనేది అందరం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు టీడీపీతో తెగతెంపులు చేసుకొని సొంతంగా బరిలో దిగే పరిస్థితిలో అది లేదు. బీజేపీకి కాస్త దూరంగా జరిగినట్టు కనిపిస్తున్నా.. టీడీపీకి మాత్రం జనసేన మద్దతిస్తూనే ఉంది. తాము చేసే రాజకీయ తప్పిదాల్ని కవర్ చేయడానికి పవన్ లాంటి స్టార్ ఒకడు టీడీపీకి అవసరం. అటు జనసేన ఏపీలో నిలబడాలంటే టీడీపీ లాంటి పార్టీ అండ అవసరం. సో.. ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయడం ఇద్దరికీ అత్యవసరం.

అనంతలో ఇప్పటికే పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన పవన్, త్వరలోనే శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలులో పర్యటించబోతున్నాడు. తన పార్టీ ఎజెండా ఏంటనే విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. కనీసం ఈ పర్యటనలోనైనా తన సినిమా కెరీర్ పై పవన్ స్పష్టమైన ప్రకటన చేయాలి.

అనంత 3రోజుల పర్యటనలో కేవలం ఒక్కసారి, ఒకే ఒక్కసారి మాత్రం సినిమాలపై ప్రకటన చేశాడు. అది కూడా ముక్తసరిగా మాట్లాడి, ఒక మాటలో ముగించాడు. అందుకే పవన్ ఇంకా సినిమాలు చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈసారి ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టాలంటే పవన్ తన సినిమా కెరీర్ పై మరింత స్పష్టంగా ప్రకటన చేయాలి. సినిమాలా..? రాజకీయాలా..? అనే విషయంపై జనాలకు ఓ క్లారిటీ ఇవ్వాలి.

ప్రస్తుతానికి పవన్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కేంద్ర బడ్జెట్ పై స్పందించడానికి కూడా బయటకు రాలేదు. మళ్లీ ఎప్పుడు బయటకొస్తాడో కూడా తెలీదు.