కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వుండవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అనేకానేక ప్రశ్నలకు అసలే సమాధానాలు వుండవు. ఆయన తనకు తొచింది చేస్తూ, ఆ విధంగా ముందుకు పోతుంటారు అంతే. దానికి ఓ వరస, వాడి, పద్దతి, పాడు అలాంటివి ఏవీ వుండవు. అలా అని వాటి వెనుక అమోఘమైన స్ట్రాటజీలు కూడా వుంటాయని అనుకుంటే అది భ్రమే.
మోడరన్ ఆర్ట్ ను ఎవరికి తోచినట్లు వాళ్లు అర్థం చేసుకున్నట్లు పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు, ఆయన చర్యలకు అర్థాలు వెదుక్కుని, సర్ది చెప్పుకుని సంబరపడుతుంటారు. అంతే.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్లుండి చెన్నయ్ వెళ్లారు. అలా అని జాతీయ రాజకీయాల కోసం కాదు. తన మాటలు తాను చెప్పుకోవడానికి. తాను ఆంధ్ర సిఎమ్ గా పోటీ చేయబోతున్నా అని ప్రకటించారు. కానీ ఎవ్వరూ సిఎమ్ గా పోటీ చేయారు. తన తరపున మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని, అప్పుడు తాను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికై, సిఎమ్ అవుతారు.
కానీ పవన్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆంధ్రలో ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర మీద పెట్టిన దృష్టి ఆయన మరే జిలాల్ల మీద పెట్టలేదు. గతంలో ఎప్పుడో అనంతపురం మీద హడావుడి చేసారు. ఆ తరువాత అది మరచిపోయారు. కృష్ణ, గుంటూరు జిల్లాల మీద దృష్టి పెట్టి, అక్కడ ఇంటికి, ఆఫీసుకు శంకుస్థాపన చేసి, ఆ సంగతి పక్కన పెట్టారు.
ఆంధ్ర అంటే ఇంకా చాలా జిల్లాలు వున్నాయి. పార్టీ నిర్మాణం లేదు. బాధ్యులు లేరు. అభిమానులు వున్నారు. కేవలం వాళ్లు వుంటే చాలదు. పార్టీ నిర్మాణం, అభిమానులను ఓటర్లుగా మార్చే వ్యవస్థ వుండాలి,. ఆ దిశగా ఆయన అస్సలు ఆలోచించడం లేదు.
చాలా విషయాలు పవన్ లైట్ తీస్కుంటారు. సింపుల్ గా వదిలేస్తారు. అనకాపల్లి వెళ్లి దాడి వీరభద్రరావును పార్టీలోకి పిలిచారు. కానీ ఈ రోజుకు ఆయన రాలేదు. పవన్ మాట మాత్రం పోయింది. ముత్తా గోపాల కృష్ణ వచ్చారు. కొన్నాళ్లు ఆయనను వెంటేసుకున్నారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఆయనను వెంటేసుకు తిరుగుతున్నారు. ఇలా కొత్త నీరు వచ్చినపుడల్లా, పాత నీటిని పక్కన పెడుతున్నారు. దీంతో ఎవరికీ కూడా పార్టీ మీద సీరియస్ నెస్ లేకుండా వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇల్లు వదిలి, పక్కింటికి వెళ్లి తన గొప్పలు చెప్పి రావడం ఎందుకు?
అంటే బాబుగారు, జాతీయ రాజకీయాల్లో తన పాత్ర వుందని చెప్పడం కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కాబట్టి, తాను కూడా పక్కన వున్న చెన్నయ్ వెళ్లి రావాలనుకున్నారా? అలా వెళ్లి వచ్చేసారా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
పార్టీ పెట్టి అయిదేళ్లయినా ఇప్పటికి ఓ రూపురేఖలు తేలేకపోయారు. ఇంక ఆరునెలలు టైమ్ వుంది. ఈ సమయంలో కూడా ఆయన ఇలా అక్కడో కాలు, ఇక్కడో కాలు వేసి, సినిమాల్లో మాదిరిగా స్ప్రింగ్ లా గెంతుతూ వుంటే, పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది.
మళ్లీ మరోసారి తెలుగుదేశం పార్టీకో, మరో పార్టీకో మద్దతు తెలియచేయడం తప్ప, తాను పోటీ చేయడం అన్నది సాధ్యం కాదు. మరి పవన్ కు ఆ విషయం తెలిసివస్తోందో లేదో?