పెద్ద సినిమాల ఫలితాలు చూసి కూడా డిస్ట్రిబ్యూటర్ల ధైర్యం సడలడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న అజ్ఞాతవాసి సినిమాను భారీ రేట్లకు అమ్ముతున్నారు. కొంటున్నారు.
ఈ సినిమాను ఈస్ట్ గోదావరికి ఎనిమిది కోట్ల రేంజ్ లో అమ్మేసారు. అదే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇదే జిల్లాలో చిరు ఖైదీ నెంబర్ 150 ఫుల్ రన్ లో వసూలు చేసింది ఎనిమిది కోట్లకు కాస్త పైగా. పవన్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు వసూళ్లు అయిదున్నర కోట్లకు కాస్త తక్కువగా.
ఇటీవల విడుదలయిన ఎన్టీఆర్ సినిమా జైలవకుశ కూడా ఈ జిల్లాలో ఇప్పటికి అయిదు కోట్లకు కాస్త పైగా మాత్రమే వసూలు చేయగలిగింది. బాహుబలి 2మాత్రమే ఈ జిల్లాలో రెండు అంకెలు దాటిని ఫిగర్ నమోదుచేసింది.
ఇలాంటి టైమ్ లో త్రివిక్రమ్-పవన్ సినిమాను ఎనిమిది కోట్ల రేంజ్ లో అమ్మడమే విశేషం అనుకుంటే ఇప్పుడు అందులో యాభై శాతం వాటాను, నాలుగున్నర కోట్లకు వేరే వాళ్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే కొన్నవాళ్లకు కోటి వెనక్కు వచ్చింది. అంత వరకు బాగానే వుంది.
కానీ ఇప్పడు వాల్యూ తొమ్మిది కోట్లు అయింది. అంటే ఆ జిల్లాలో ఈ సినిమా కనీసం 10కోట్లు షేర్ వసూలు చేయాల్సి వుంటుంది. అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక్క ఈస్ట్ గోదావరి జనాల డబ్బు ఈ సినిమాకు పది కోట్లు సమర్పించుకోవడానికి సిద్ధం కావాలన్నమాట.