పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఇప్పటిదాకా సెట్ మీదకు వెళ్లలేదు. ఓ సినిమా చేతిలో వున్నా కూడా అలా డ్రాగ్ అవుతోంది. ఆఖరికి ఈ నెలాఖరుకు సెట్ మీదకు వెళ్తుందని టాక్. పోనీ అలాగే వెళ్తుందని అనుకన్నా, ఈ సినిమా ఫినిష్ కావడానికి ఎలా లేదన్నా ఆరునెలలకు పైనే పడుతుంది. అది కూడా పవన్ నాన్ స్టాప్ గా చేస్తే. కానీ అలాంటి అవకాశం తక్కువ. పైగా ఈ సినిమా వచ్చే మార్చి, ఏప్రిల్ టార్గెట్ గా తయారవ్వాల్సిందే. అంటే సుమారు పదినెలలు అనుకోవచ్చు.
మరి అంతకాలం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీగావుండాల్సిందేనా? పవన్ కోసం ఇప్పటికిప్పుడు అనుకున్నా, త్రివిక్రమ్ స్క్రిప్ట్ తయారుచేయడానికి మహా అయితే మూడు నెలలు టైమ్ పడుతుంది. మరి ఆ తరువాత?
ఇన్ సైడ్ వర్గాల కథనం ఏమిటంటే, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి రెడీగా వుండమని త్రివిక్రమ్ కు పవన్ చెప్పారని? అదెలా సాధ్యం? అంటే డాలీ డైరక్షన్ లోని సినిమాను పక్కన పెడతారా? కానీ అది ఈ నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్తుందని యూనిట్ జనాలు చెబుతున్నారు.
అంటే పవన్ చాలా ప్లాన్డ్ గా త్రివిక్రమ్ మరో సినిమా చేయకుండా లాక్ చేసారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పవన్ సినిమా లాక్ లేకపోతే, త్రివిక్రమ్ కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా చేసి వుండేవారు. బన్నీకి కూడా ఇప్పుడు మంచి టాప్ డైరక్టర్లు ఎవరూ అందుబాటులో లేకనే, హరీష్ శంకర్ కు అవకాశం ఇచ్చారన్నది ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్ ఇలా బన్నీ వైపు వెళ్తారనే, పవన్ తెలివిగా, అ..ఆ అడియో ఫంక్షన్ సమయంలోనే నిర్మాత చినబాబును తనతో సినిమా చేయమని కోరారని టాక్. పైగా త్రివిక్రమ్ కూడా పవన్ వైపే మొగ్గు చూపారు.
డాలీ సినిమా ఈ నెలాఖరుకు కూడా ప్రారంభం కాకపోతే, త్రివిక్రమ్ సినిమానే ముందు వెళ్తుందన్న మాటలు నిజమవుతాయి. లేదూ అంటే పవన్ కోసం త్రివిక్రమ్ ఓ పది నెలలు ఖాళీగా వుంటారు..ఆయనతో పాటే హారిక హాసిని బ్యానర్ కూడా.