గురువారం..శుక్రవారం రెండు సార్లు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముచ్చటగా మూడోసారి శనివారం సుప్రభాత సేవలో పాల్గొనబోతున్నారు. ఆ తరువాత అక్కడే తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు.
అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తొలి సభ తిరుపతిలోనే జరిగింది. మోడీ-బాబుల మధ్యన పవన్ ప్రజల ముందుకు వచ్చింది తిరుపతిలోనే. మళ్లీ ఇప్పుడు ఇంకోసారి. ఒక విధంగా జనసేన పెట్టిన తరువాత పవన్ తొలి బహిరంగసభ ఇదేనేమో? ఎందుకంటే ఇదివరకటి సభలు అన్నీ ఒక విధంగా క్లోజ్డ్ డోర్స్ లో జరిగాయి.
అసలు ఇంతకూ పవన్ బహిరంగ సభ ఎందుకు అన్నది అసలు విషయం? కేవలం అభిమాని హత్యకు సంబంధించి మాట్లాడడానికి అయితే సభ అనవసరం. ప్రెస్ మీట్ సరిపోతుంది. ఎందుకంటే ఇది జనాల సమస్య కాదు. కొందరి సమస్య మాత్రమే.మరి హోదా మీద గొంతు విప్పాలని పవన్ అనుకుంటున్నారా? తిరుపతి నుంచి జనసేన రాజకీయ కార్యకలాపాలు షురూ చేయాలని అనుకుంటున్నారా? లేదా హోదా గురించి చంద్రబాబు ఇరుకున పడుతున్నారు. ఆయన మోడీని నిలదీయలేకపోతున్నారు. అందువల్ల బాబు తరపున పవన్ గొంతు సవరించుకోబోతున్నారా?
ఇదిలా వుంటే ఇవన్నీ ప్రశ్నలే. ఇన్నాళ్లు లేనిది జనసేన ప్రతినిధి, జనసేన కోశాధికారి అంటూ కొన్నిపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీళ్ల నియామకాలన్నీ ఎప్పుడు జరిగాయో తెలియదు. చూస్తూ వుంటే పవన్ చాలా పెద్ద వ్యూహంతోనే ముందుకు కదులుతున్నట్లుంది.
రేపు మంచి ముహురం వుందని, అది దాటితో మళ్లీ కొన్నాళ్ల దాకా ముహుర్తాలు లేవని, అందుకే పవన్ జనసేన కార్యకలాపాలు షురూ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. ఏది నిజమో రేపు పవన్ ప్రసంగంతో తెలిసిపోతుంది. కొత్తగా వుంటుందో? లేదా ఎప్పటిలా చంద్రబాబుకు ఉపయోగపడేలా మాట్లాడేసి మళ్లీ గూటిలోకి వెళ్లిపోతారో?