పవన్ కొత్త సినిమా.. తెరపైకి మరో టైటిల్

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని టైటిల్స్ హల్ చల్ చేశాయి. ఈమధ్య పరదేశ ప్రయాణం అంటూ మరో టైటిల్ చర్చకొచ్చింది. దాదాపు ఆ టైటిల్ పెట్టేశారంటూ ప్రచారం కూడా జరిగింది.…

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని టైటిల్స్ హల్ చల్ చేశాయి. ఈమధ్య పరదేశ ప్రయాణం అంటూ మరో టైటిల్ చర్చకొచ్చింది. దాదాపు ఆ టైటిల్ పెట్టేశారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అవేవీ పక్కా కాలేదు. ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈసారి పవన్ కొత్త సినిమా పేరు “గోకుల కృష్ణుడు”. ప్రస్తుతం ఇదే టైటిల్ ఫిలింనగర్ లో రౌండ్స్ కొడుతోంది.

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే ఐదారు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. దేవుడే దిగి వస్తే, ఇంజనీరు బాబు, మాధవుడు, పరదేశ ప్రయాణం.. ఇలా కొన్ని టైటిల్స్ వెలుగులోకి వచ్చాయి. అవేవీ కాదని తేలిపోయాయి కూడా. తాజాగా గోకుల కృష్ణుడు అనే టైటిల్ జోరుగా తిరుగుతోంది. ఇదే టైటిల్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రెడీ అయిపోతున్నాయి.

అయితే ప్రస్తుతానికి టైటిల్ పై ఎలాంటి ఆలోచన పెట్టుకోలేదు యూనిట్. షూటింగ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. నిన్నట్నుంచి 11 రోజుల పాటు సాగే మరో షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా టైటిల్ పై ఓ నిర్ణయానికి వస్తారట.