పవన్ ఫోన్ చేస్తే ఎత్తకుంటే ఎలా?

గంగరాజు గారూ.. గంగరాజు గారూ.. పవన్ ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? మీ ప్రచారానికి పవన్ రావాలి కానీ, ఆయన ఫోన్ చేయగానే మీరు ఎత్తరా? తప్పుకాదూ? పవన్ దెప్పమంటే దెప్పరా? పైగా ఆయన…

గంగరాజు గారూ.. గంగరాజు గారూ.. పవన్ ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? మీ ప్రచారానికి పవన్ రావాలి కానీ, ఆయన ఫోన్ చేయగానే మీరు ఎత్తరా? తప్పుకాదూ? పవన్ దెప్పమంటే దెప్పరా? పైగా ఆయన ఫోన్ చేసింది ఎవరి కోసం? ఆయన సామాజిక వర్గానికి చెందిన ఫ్యాన్స్ ను ఫ్లెక్సీల గొడవలో లోపల వేస్తే, వద్దని చెప్పమని చెప్పడానికి కదా? పవన్ కు కులం అంటే కిట్టదు అది వేరే సంగతి.

కానీ ఆయన కులానికి చెందిన ఫ్యాన్స్ అన్నపుడు స్పందించకుండా వుంటారా? పైగా మీరు వేరే కులమాయె? అయినా గొడవ మీ కులానికి చెందిన మీ హీరో ఫ్యాన్స్ కు, పవన్ కులానికి చెందిన ఫ్యాన్స్ కు మధ్య కదా? అందుకే మీ చేత చెప్పించడం అన్నది పవన్ స్ట్రాటజీ కావచ్చు.

అలాంటిది మీరు ఫోన్ ఎత్తకపోతే ఆయనకు ఎంత కోపం వస్తుంది. ఆయన కనుక నిగ్రహించుకుని, వేరే వాళ్లని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేయించి, తన కులం కులానికి చెందిన ఫ్యాన్స్ ను బయటకు తీసుకురాగలిగారు. ఇదంతా ఆయన చెబితే ఇప్పుడు బయటకు తెలిసింది. తన కులానికి చెందిన తన ఫ్యాన్స్ కోసం ఈమాత్రం చేసారు అంటే పవన్ చాలా గొప్పవారే.

అసలు ఆ సంగతి సరే, పవన్ ఫోన్ చేస్తే, ఎంపీ గంగరాజు గారూ మీరు ఫోన్ ఎందుకు ఎత్తలేదు. మీ ప్రచారానికి వచ్చి, మిమ్మల్ని గెలిపించారు కదా? మళ్లీ వచ్చే ఎన్నికల్లో వచ్చి గెలిపించాలి కదా? మరి ఆ సంగతి మరచిపోతే ఎలా? పవన్ లైట్ తీస్కుంటాడు అనుకున్నారా?

ఆయన దెప్పుళ్లు దెప్పుతారని మీకు తెలియదా? ప్రచారానికి పనికి వచ్చాను. దీనికి పనికి రాలేదా? దానికి పనికిరాలేదా అని భాజపాను, తేదేపాను పదే పదే దెప్పుతూ వుంటారు. మిమ్మల్ని మాత్రం వదిలేస్తారని ఎందుకు అనుకున్నారు. అనుకుని వుండరు. లేదూ అంటే ఫోన్ టక్కున ఎత్తి జీ హుజూర్ అనేవారు. 

ఇకమీదటైనా జాగ్రత్తగా వుండడం అవసరం గంగరాజు గారూ. రాబోయే ఎన్నికల్లో మీకు పవన్ సపోర్టు కావాలంటే, అసలే మీ జిల్లాలో పవన్ సామాజిక వర్గం మద్దతు మీ విజయానికి చాలా అవసరం. ఇకపైనైనా పవన్ ఫోన్ చేస్తే వెంటనే ఎత్తండి. ఏమంటారు.