మైత్రీ మూవీస్ ఎప్పుడో ఇచ్చి, మురిగిపోతున్న అడ్వాన్స్ లు రెండు వున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ కు, రెండో ఆయన మిత్రుడు డైరక్టర్ త్రివిక్రమ్ కు. సరే, త్రివిక్రమ్ అంటే సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఎప్పుడో అప్పుడు బాకీ తీర్చేఅవకాశం వుంది. మరి పవన్ కళ్యాణ్? ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ మధ్య మైత్రీ జనాలు అడ్వాన్స్ వెనక్కు తెచ్చుకుంటారని వార్తలు వినవచ్చాయి.
కానీ అలా తెచ్చుకోలేదని, అడ్వాన్స్ అలాగే వుందని ఇప్పుడు క్లియర్ అయింది. సవ్యసాచి విడుదల సందర్భంగా నిర్మాతలు నవీన్, రవి, మోహన్ మీడియాతో మాట్లాడినపుడు 'గ్రేట్ ఆంధ్ర' ఈ విషయమై ప్రశ్నించింది. పవన్ తో ఎప్పటికైనా సినిమా చేయాలన్నదే తమ ఆశ అని, చేస్తారనే అనుకుంటున్నామని అన్నారు.
దీనిపై కాంట్రావర్సీ వద్దని, పవన్ మళ్లీ సినిమా చేస్తారనే అనుకుంటున్నామన్నారు. అలాగే తివిక్రమ్ కూడా సినిమా చేస్తారని, హీరో ఎవరన్నది ఆయన చెప్పే స్క్రిప్ట్ మీద ఆధారపడి వుంటుందని అన్నారు. భారీ సినిమాలు, మీడియం సినిమాలతో పాటు, కొత్తవాళ్లతో చిన్న సినిమాలు కూడా చేయాలని వుందని, ఇప్పటికే కోటి రూపాయల ప్రాజెక్టు ఒకటి ఓకె చేసామని అన్నారు.
2019లో తమ బ్యానర్ నుంచి అయిదు సినిమాలు విడుదలయ్యే అవకాశం వుందన్నారు. సవ్యసాచి ఓవర్ బడ్జెట్ కాలేదని, సేఫ్ ప్రాజెక్ట్ నే అని నిర్మాతలు వెల్లడించారు. భవిష్యత్ లో చందు మొండేటితో మరో ప్రాజెక్టు వుంటుందన్నారు.
రవితేజ-సంతోష్ శ్రీనివాస్ సినిమా వచ్చే నెలలో స్టార్ట్ అవుతుందన్నారు. సరైన డేట్ సెట్ కాకనే సవ్యసాచి విడుదలయిన రెండు వారాలకే అమర్ అక్బర్ ఆంధోనిని విడుదల చేయాల్సి వస్తోందన్నారు.
కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్