తరచి చూస్తే.. వర్మ చేతిలో ఇప్పడు అరడజను సినిమాలున్నాయి. అవన్నీ విడుదలకు సిద్ధమైన దశలో ఉన్నవి కొన్ని, సైలెంట్ గా షూటింగు జరుపుకొంటున్నవి మరికొన్ని. వీటిలో 'పట్టపగలు' వంటి సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో కూడా అర్థం కాని పరిస్థితే ఉంది. ఇక 'అటాక్' సినిమాను మళ్లీ కదిలించారు. ఈ సినిమాను సి.కల్యాణ్ విడుదల చేయనున్నాడు. 'లోఫర్ ' సినిమా ఇంటర్వెల్ బ్రేక్ లో ఈ సినిమా ట్రైలర్స్ ను ప్రదర్శిస్తున్నారు. ఇక 'కిల్లింగ్ వీరప్పన్' కు కూడా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.
ఇవి మాత్రమే గాక.. ఎక్సెస్, మొగళిపువ్వు, సీక్రెట్.. వంటి సినిమాలు కూడా రూపొందుతున్నాయి వర్మ కంపెనీలో. ఈ సినిమాలన్నింటికీ దర్శకుడిగా వర్మ పేరే ఉంది. కానీ ఈ బై లింగ్వల్, ఎరోటిక్, యాక్షన్, హారర్ జోనర్ లలోని సినిమాలకు పని చేస్తున్న వారిలో మాత్రం చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. వర్మ దగ్గరి అసిస్టెంట్ లు, అసోసియేట్ లు… ఈ సినిమాలను చుట్టేస్తున్నారని సమాచారం. పేరుకు దర్శకుడిగా వర్మ పేరే పడినా… వర్మ కు నమ్మకస్తులైన క్రియేటర్లు తలా ఓ చేయ్యేసి ఈ సినిమాలను పూర్తి చేస్తున్నారు.
అయినా ఈ తీరు వర్మకు కొత్తేమీ కాదు. వర్మ దర్శకత్వం నుంచి దర్శకత్వ పర్యవేక్షణ స్థాయికి వచ్చే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగుతోంది. మరి ఒకేసారి అరడజను సినిమాలతో డీల్ చేయడం అంటే మాటలు కాదు కదా! అయితే డైరెక్టర్ గా తన పేరే వేసుకొంటూ.. ఆయా సినిమాల హిట్టూ ప్లాఫులకు తనే బాధ్యత వహిస్తున్నాడు వర్మ.