బాహుబలి టీమ్ సంగతి టాలీవుడ్ జనాలకు, టాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వాళ్లకు టాలీవుడ్ మీడియా అంటే చులకన. వీళ్లకు ఇంటర్వూలు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే, వీళ్లకు ఏమీ చెప్పినా చెప్పకున్నా ఒక్కటే. వాళ్లే మన వెనుక పరుగెత్తుకుంటూ వస్తారు. రాస్తారు. అదీ రాజమౌళి అండ్ టీమ్ ధీమా. టాలీవుడ్ మీడియా కూడా బాహుబలి వెనుక అలాగే పడుతుంటుంది కూడా.
అందుకే బాహుబలి 2 కి సంబంధించి టాలీవుడ్ లో ప్రచారానికి అస్సలు పెద్దగా టైమ్ కేటాయించనక్కరలేదని, ప్రకటనలకు రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేదని రాజమౌళి అండ్ బాహుబలి టీమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పేసారట. ముఖ్యంగా ఓవర్ సీస్ బయ్యర్ కు, తెలుగు పబ్లిసిటీని మర్చిపొమ్మని క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే బాలీవుడ్ లో మాత్రం బాహుబలి పబ్లిసిటీకి కోట్లు కుమ్మరిస్తోంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే, సూపర్, తురుము, తోపు అనే రేంజ్ లో సమీక్షలు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినికిడి. ఆ మేరకు 'భారీ' ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి పార్ట్ వన్ టైమ్ లో కూడా బాలీవుడ్ టాప్ క్రిటిక్ ల విషయంలో బాహుబలి టీమ్ చాలా ఉదారంగా వ్యవహరించినట్లు వదంతులు వినిపించాయి. బాలవుడ్ లో వున్న సైట్లు, మ్యాగ్ జైన్లు అన్నింటికీ ప్రకటనలు కుమ్మే ప్లానింగ్ జరుగుతోంది. మరోపక్క తమిళనాట కూడా పబ్లిసిటీకి వెనుకాడకుండా ఖర్చు చేసే ఏర్పాట్లలో వున్నారు.
తెలుగునాట ప్రకటనల సంగతి దేవుడెరుగు. కనీసం ఇంటర్వూలు అన్నా ఇస్తారా అన్నది అనుమానమే.