స్వంత బ్యానర్ యువిలో బాహుబలి ప్రభాస్ 'రాథేశ్వామ్' సినిమా నిర్మాణంలో వుంది. సాహో తో పాటే ఇదీ ప్రారంభమైంది. స్నేహం అంటే చాలు ధైర్యంగా ముందుకు దూసుకుపోయే యువి అధినేతలు ఒక్క ఫ్లాపు సినిమా మాత్రమే చేతిలో వున్న రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా స్టార్ట్ చేసారు. సాహో లాంటి వందల కోట్ల సినిమా కూడా ఇలాగే ఒక్క హిట్ వున్న సుజిత్ చేతిలో పెట్టారు.
రాథేశ్వామ్ కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఇటలీలో వింటేజ్ ఇటలీ లుక్ నేపథ్యంలో షూటింగ్. అంటే అర్థం అయిపోతుంది విజువల్స్ ఎంత కీలకమో, దీనికి ఎంత ఖర్చో? అటు ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఇటు సిజి వర్క్.. దీనికి అటు డబ్బు ఖర్చు ఇటు టైమ్ ఖర్చు. అందుకే రాథేశ్యామ్ అలా మెల్లగా ముందుకు సాగుతోంది.
ఇప్పటికి చాలా వరకు సినిమా పూర్తయినా, కరోనా నేపథ్యంలో లెగ్ బ్రేక్ పడిపోయింది. ఇక మళ్లీ ఎప్పుడు అన్నది ఎవ్వరికీ క్లారిటీ లేదు. పైగా కొద్దిగా ఇటలీ ప్యాచ్ వర్క్ పెండింగ్ వుందని బోగట్టా. ఇప్పట్లో ఇటలీలో షూటింగ్ అన్నది అసాధ్యం. అదేదో ఇక్కడే ఫినిష్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ వర్క్ వుంది.
ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఒకటే వేడుకోలు..అప్ డేట్ ఇవ్వండి బాబూ…ఒక్క స్టిల్ అయినా ఇవ్వండి బాబూ అంటూ. కానీ అఫీషియల్ గా ఏదీ లేదు. సాహో టైమ్ లో కూడా అంతే. ముందుగా ఒక్క స్టిల్ అంటూ ఫ్యాన్స్ వేడుకున్నా ఇవ్వలేదు. సినిమా విడుదల తరువాత తామరతంపరగా స్టిల్స్..స్టిల్స్.
కానీ యువి సంస్థ అనుష్కతో సినిమా, శర్వాతో సినిమా, ఇంకో సినిమా, ఇంకో సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి తప్ప, రాథేశ్వామ్ సంగతేమిటి? అన్నది మాత్రం వినిపించడం లేదు.
ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా అసంతృప్తిగా వున్నారని ట్విట్టర్ ను ఫాలో అయ్యేవారికి తెలిసిపోతుంది. ఇలాంటి టైమ్ లో రాథేశ్వామ్ సినిమా అసలు ఎంత వరకు ఫినిష్ అయింది. ఇక ఎంత వర్క్ బ్యాలెన్స్ వుంది. ఎప్పటికి రెడీ కావచ్చు లాంటి అప్ డేట్స్ ను అధికారికంగా కాస్తయినా ఇస్తే, ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు. లేదంటూ రకరకాల గ్యాసిప్ లు పుట్టుకువచ్చి, వారిని అయోమయంలో పడేస్తాయి.