సర్రున టాలీవుడ్ లోకి దూసుకు వచ్చింది మైత్రీ మూవీస్. చకచకా అడ్వాన్స్ లు ఇచ్చి, అంతకన్నా స్పీడ్ గా రెండు సినిమాల చేసేసి, హిట్ లు తన ఖాతాలో వేసుకుని, మంచి బ్యానర్ గా పేరు తెచ్చేసుకుంది. కానీ ఆ తరువాతే లెగ్ బ్రేక్ పడిపోయింది. సుకుమార్ తో సినిమా తీయాలనుకోవడమే సమస్యగా మారింది.
మంచి దర్శకుడు అని పేరు తెచ్చుకున్నా, అంత సులువుగా సినిమా తయారు కాదు అనే అపప్రధ వుంది సుకుమార్ పై. నాన్నకు ప్రేమతో సినిమా సంగతి, దాని ముందు వన్ సినిమా సంగతి తెలిసిందే. చెక్కి చెక్కి, వదుల్తారు. సినిమా బాగా వస్తుంది కదా? మైత్రీ మూవీస్, రామ్ చరణ్ మూవీని కూడా సుకుమార్ అలాగే చెక్కుతున్నారు.
అసలు ప్రీ ప్రొడక్షన్ నుంచి సెట్ మీదకు రావాడానికే కిందా మీద అయ్యారు. ముఫై మూడు డేట్లు మారాయి. పలు విషయాల్లో సుకుమార్ తన మాట నెగ్గాల్సిందే అని పట్టుపట్టడం వంటివి తెరవెనుక చోటు చేసుకున్నాయి. ఆఖరికి షూట్ స్టార్ట్ అయింది.
ఇప్పుడు కీలక నటుడు రావు రమేష్ తో విబేధాలు వచ్చి, ఆయన పక్కకు తప్పుకున్నారన్న వార్తలు గుప్పు మన్నాయి.ఇప్పటి దాకా షూట్ చేసింది ఏమవుతుందన్నది సమస్య. సమంత ఫాదర్ గా రావురమేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చాలా సీన్లు తీసారు. మరి ఆ సీన్లు అన్నీ ఏం చేస్తారు? ప్రకాష్ రాజ్ ను తీసుకుంటారు అంటున్నారు. మరి ఆయన డేట్లు సెట్ కావాలి. మళ్లీ షూట్ లు స్టార్ట్ చేయాలి. అంటే మరి సినిమా బడ్జెట్ ఏమేరకు పెరుగుతుంది?
అయినా ఇటీవలి కాలంలో టెక్నీషియన్లను, ఏక్టర్లను మధ్యలోనే మార్చేయడం అన్నది తెలుగు సినిమా డైరక్టర్లకు బాగా అలవాటైపోయింది. దీనివల్ల నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. అ..ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్, సర్దార్ విషయంలో పవన్, జై లవకుశ తో బాబీ, డిజె తో హరీష్ శంకర్ ఇలాంటి వాటికి చోటిచ్చిన సంగతి తెలిసిందే.