ప్రేక్షకుడిని కన్విన్స్ చేయచ్చు

ఒక్కప్పుడు తెలుగు తెరపై సెంటిమెంట్లు, మానవ సంబంధాలు, కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు రాజ్యమేలాయి. రాను రాను వాటి స్థానంలో డిష్యుం..డిష్యుం..సినిమాలు, ప్రేమ కథలు చోటుచేసుకున్నాయి. రాను రాను ఇవే సినిమాలుగా మిగిలాయి. కుటుంబాలు, బంధాలు,…

ఒక్కప్పుడు తెలుగు తెరపై సెంటిమెంట్లు, మానవ సంబంధాలు, కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు రాజ్యమేలాయి. రాను రాను వాటి స్థానంలో డిష్యుం..డిష్యుం..సినిమాలు, ప్రేమ కథలు చోటుచేసుకున్నాయి. రాను రాను ఇవే సినిమాలుగా మిగిలాయి. కుటుంబాలు, బంధాలు, కష్టాలు ఇవన్నీ చిన్న తెరకు షిప్టయిపోయాయి. అలాంటి సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త ధైర్యం చేసి, కుటుంబ బంధాలకు కాస్త వినోదాన్ని జోడిస్తూ, అత్తారింటికి దారేది సినిమా అందించాడు. జనం ఆదరించారు.కొరటాల శివ తన తొలి సినిమా మిర్చిలో మరి కొంత ప్రయోగం చేసాడు. పక్కా మాస్ ఎలిమెంట్స్ కు, ఫ్యామిలీ బంధాలు జోడించాడు. జనం సూపర్ అన్నారు. దారి చూపిన త్రివిక్రమ్ ఇంకోసారి ధైర్యం చేసాడు. సన్నాఫ్ సత్యమూర్తి అంటూ ఓ పక్కా మాస్ హీరోను తీసుకెళ్లి, పూర్తి క్లాస్ పాత్రలోకి దించేసాడు. విలువలు, బోధనలు అంటూ తాను చెప్పాల్సింది స్మూత్ గా చెప్పేసాడు. జనం దాన్నీ ఆదరించారు. ఇప్పుడు మహేష్ దైర్యం చేసాడు. కొరటాల శివ అటెంప్ట్ చేసాడు. శ్రీమంతుడు. టైటిల్ దగ్గర నుంచే 'అదో రకం' ఈ సినిమా చూసిన వాళ్లంతా అనే మొదటి మాట..మహేష్ చాలా ధైర్యం చేసాడు అని. 

చేదుమాత్రలకు షుగర్ కోటింగ్ మాదిరిగా మంచి విషయాలకు, కాస్త మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే వర్కవుట్ అవుతుంది అని ప్రూవ్ అయింది. కానీ ఇక్కడ మంచి విషయాలకు, మాస్ ఎలిమెంట్స్ తో పాటు హీరో కీలకంగా మారాడు. పవన్ లేకుండా అత్తారింటికి దారేదిని కానీ, మహేష్ లేకుండా శ్రీమంతుడును కానీ చూడడం కష్టం. మరొక హీరోకి సూటయ్యే సబ్జెక్ట్ లు లేదా టేకింగ్ లు కావు. అంటే విషయం, వివరణ తో పాటు హీరో జత కూడితే జనాలను కన్విన్స్ చేయచ్చు..మంచి సినిమాలు, వైవిధ్యమైన సినిమాల దిశగా టాలీవుడ్ ను నడిపించవచ్చు.