ప్రయివేటు అవార్డులు వారి స్వంతమా?

తెలుగునాట వున్నంత సినిమా ఇంట్రెస్ట్ ఇంతా అంతా కాదు. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు వచ్చే అవార్డుల ఫంక్షన్ లు అంటే మరీ ఆసక్తి. ఇలాంటి ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ రేట్లు కనీసం రెండు…

తెలుగునాట వున్నంత సినిమా ఇంట్రెస్ట్ ఇంతా అంతా కాదు. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు వచ్చే అవార్డుల ఫంక్షన్ లు అంటే మరీ ఆసక్తి. ఇలాంటి ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ రేట్లు కనీసం రెండు మూడు కోట్ల నుంచి ఆ పైన పలుకుతాయి. పైగా పెద్ద హీరోలు వస్తారు. టెలికాస్ట్ భారీగా అవుతుంది అంటే స్పాన్సర్లు క్యూలు కడతారు. పైగా ఇలాంటి ఫంక్షన్ లు చేసేవారు కూడా కాస్త హై ఫై సర్కిల్ జనాలు అయివుంటారు. అందువల్ల వాళ్ల పరిచయాలతో స్పాన్సర్లను తెచ్చుకోవడం కష్టం కాదు.

ఇది ఒక ఫేజ్. ఆ తరువాత తమ తమ పరిచయాలు ఉపయోగించి, టాప్ హీరోలతో టచ్ లోకి వెళ్తారు. అవార్డు ఇస్తాం వస్తారా? అంటారు. వస్తాం అంటేనే అవార్డు ఇస్తాయి ఈ పెద్ద కార్పొరేట్ అవార్డు సంస్థలు. హీరోలకు పరిచయాలతో, మొహమాటాలతో, అవార్డులతో గేలం వేస్తారు. హీరోయిన్లను, డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ లకు పారితోషికాలతో లాక్కొస్తారు. మిగిలిన వారిని ఫ్లయిట్ టికెట్ లు, హోటల్ ఖర్చులు ఇచ్చి తీసుకువస్తారు. ఇలాంటి వాళ్లలో కొంత మంది వంది మాగధులు కూడా వుంటారు. వీళ్లు లేకుంటే పబ్లిసిటీ ఎలా వస్తుంది? అందుకే వీరు కూడా. లాస్ట్ ఇయర్ వరకు ఇలాంటి సంస్థ ఒక్కటే వుండేది. ఇప్పుడు మరో సంస్థ కూడా రంగప్రవేశం చేసింది. ఇటీవల అవార్డుల ఉత్సవం ముగిసింది. కానీ అక్కడే చిన్న తేడా వచ్చింది. తొలిసారి ఈ అవార్డులపై అసంతృప్తి గళం వినిపించింది. పెళ్లిచూపులు లాంటి సినిమాను పూర్తిగా విస్మరించారని, ఆ సినిమా దర్శకుడు ఫేస్ బుక్ సాక్షిగా కాస్త గట్టిగానే విమర్శించారు. అది వాస్తవం కూడా.

చిత్రంగా తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్లు అవార్డు నిర్వాహకులనే వెనకేసుకు వస్తున్నారు. ప్రయివేటు అవార్డులు వారి స్వంతం. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు ఆ ఫంక్షన్? పెద్ద హీరోలు వస్తేనే జనం ఫంక్షన్ చూస్తారు. అందుకే పెద్ద హీరోలకు, పెద్ద సినిమాలకు అవార్డులు ఇస్తారు. చిన్న సినిమాలు, చిన్న హీరోలు వస్తే ఎవరు చూస్తారు? జనమే చూడరు. నంది అవార్డుల ఫంక్షన్ కు ఎవరయినా వస్తారా? ఎవరయినా చూస్తారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఒక విధంగా తమ్మారెడ్డి భరద్వాజ కరెక్టే కావచ్చు. కానీ ఇలాంటి వైఖరిని ఖండించాలి. జనాలకు ఇది తప్పు అని చెప్పాలి. ఆయన లాంటి నిర్మొహమాటి కూడా ఇలా చెప్పకపోతే, ఇంకెవరు చెబుతారు. పంక్షన్ ప్రయివేటుది కావచ్చు, అవార్డులు ప్రయివేటు అవార్డులు కావచ్చు, అంత మాత్రం చేత ప్రతిభను గుర్తించము అంటే ఎలా? 

అప్పుడు టాలీవుడ్ టోటల్ గా ఇలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం మానేయాలి. లేదూ అంటే తమ్మారెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రయివేట్ అవార్డుల సంస్థలు ఎంత టర్నోవర్ చేస్తున్నాయి. అవార్డుల ఫంక్షన్ కు ఎంత ఖర్చు చేస్తూ, ఎంత ఆర్జిస్తున్నాయి. ఆ ఆర్జన మార్గం ఏమిటన్నది ఓపెన్ గా మాట్లాడాలి. అప్పుడు జనానికి ఇలాంటి అవార్డుల పట్ల విముఖత కలుగుతుంది. కొనుక్కున్న అవార్డులు అని అర్థం అయిపోతుంది. అలా చేయకుండా జనాలదే తప్పు అన్నట్లు మాట్లాడడం సరి కాదేమో?