దక్షిణాది నుంచి జాతీయ ఉత్తమనటి అవార్డును తీసుకున్న అతి తక్కువమంది హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఈ తరంలో అయితే.. అలాంటి ఫీట్ ను సాధించిన వారిలో మీరా జాస్మిన్ , ప్రియమణి లేనని చెప్పుకోవాలి. అయితే అవార్డు స్థాయి హీరోయిన్లకు సౌత్ లో అంతగా కలిసి రాలేదు. మీరా సంగతి పక్కనపెడితే ప్రియమణి స్కిన్ షోలకు, స్విమ్ సూట్లకు కూడా ఓకే చెప్పింది. అయితే అవేవీ ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాల భాషల్లో ప్రియమణి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఇదే పరిస్థితుల మధ్య ఆమె పెళ్లి చేసుకొంటున్నాను అనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.
మరి అలా సెటిలయిపోతుందని అనుకొంటే.. వివాహం కూడా వాయిదా పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రియమణి మళ్లీ సినిమా అవకాశాల కోసం తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోంది. అలాగే ఆమె ఇప్పుడు తన మరో కోరికను కూడా బయటపెట్టుకుంది.. అదేమిటంటే.. తనకు డైరెక్షన్ చేయాలని ఉందట. ఇన్ని రోజుల సినీ ప్రయాణంతో తనకు ఈ కోరిక జనించినట్టుగా ప్రియమణి చెప్పుకొచ్చింది. అలాగే తను డైరెక్టర్ గా ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నాననే విషయాన్ని కూడా ఆమె వివరించింది.
కన్నడ స్టార్ హీరో సుదీప్ ను హీరోగా పెట్టి ఒక సినిమాను తీయాలనుకొంటున్నట్టుగా ప్రియమణి చెప్పుకొచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో తన కు అవకాశాలు మృగ్యమయ్యాకా ప్రియమణి కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. ఆ పరిచయాలతో ఇప్పుడు సుదీప్ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరికను బయటపెట్టింది. మరి ఈ హీరోయిన్ కోరికను ఆ కన్నడ స్టార్ హీరో అవకాశమిచ్చి తీరుస్తాడేమో చూడాలి!