తమ సోషల్ మీడియా ఖాతాలను వివిధ బ్రాండ్ల ప్రమోషన్ కోసం ఉపయోగించే సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. సోషల్ మీడియాలో వీళ్ల ఫాలోయింగ్ ను బట్టి, వీళ్లకు బోలెడంత డబ్బులిచ్చి తమ ప్రమోషన్ కోసం పోస్టులు పెట్టించుకునే బ్రాండులు చాలా ఉన్నాయి. ఇలా సెలబ్రిటీలు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఒక్కో పోస్టుకు ఇంత అని వీళ్లు వసూలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో మాజీ హీరోయిన్, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రమ్ పేజ్ లో ప్రమోషనల్ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక సర్ఫ్ కంపెనీ ప్రమోషన్ పోస్టులు పెట్టారు. ఆ పోస్టులో నమ్రత మాత్రమే కాకుండా, మహేశ్ బాబు కూడా కనిపిస్తాడు. ఇలా భార్యభర్తలిద్దరూ కలిసి ఆ సర్ఫ్ ను తాము వాడతామన్నట్టుగా వాషింగ్ మిషన్ దగ్గర నిలబడి పోజులిచ్చారు. అందుకు సంబంధించి కొటేషన్ ను కూడా యాడ్ చేశారు.
ఇది పక్కా ప్రమోషనల్ పోస్టులాగే ఉంది. ఈ క్రమంలో తమ సోషల్ మీడియా ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటున్నట్టుగా ఉంది మహేశ్ బాబు ఫ్యామిలీ అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు వివిధ రకాల ఎండోర్స్ మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా నమ్రతా శిరోధ్కర్ ఖాతా ద్వారా కూడా ప్రమోషనల్ పోస్టుల ద్వారా క్యాష్ చేసుకుంటున్నట్టున్నారని, వీళ్లది నాలుగు చేతుల సంపాదనలాగుందని నెటిజన్లు అంటున్నారు.