గత ఏడాది దసరా సందర్భంగా విడుదల అయిన మోహన్ లాల్ మలయాళీ చిత్రం ‘పులి మురుగన్’ తాజాగా వంద రోజులను పూర్తి చేసుకుంది. ఇంతకన్నా విశేషం ఏమిటంటే ఈ సినిమా వసూళ్లు నూటా యాభై కోట్ల రూపాయలకు చేరాయని దీని రూపకర్తలు ప్రకటించడం. ఇంత వరకూ మలయాళ చిత్ర చరిత్రలో ఏ సినిమా కూడా సాధించలేదు ఈ స్థాయి వసూళ్లను.
గత ఏడాది మోహన్ లాల్ కు ఆసాంతం కలిసి వచ్చింది. వరస సూపర్ హిట్లు, జనతా గ్యారేజ్ వంటి భారీ వసూళ్ల బొమ్మ తర్వాత ‘పులిమురుగన్’ తో లాల్ భారీ విజయాన్నే సొంతం చేసుకున్నాడు. కేవలం మల్లూ వుడ్ వరకే కాదు, 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం దక్షిణాదిలోనే గొప్ప ఘనత.
ఇది వరకూ కొన్ని సౌత్ సినిమాలు ఈ స్థాయి వసూళ్లను సాధించినా, వాటి మేకింగ్ కోసం భారీ మొత్తాలను వెచ్చించడం, భారీ హైప్ ను సృష్టించడం జరిగింది. అయితే అంత స్థాయి పెట్టుబడులు, హద్దులు మీరిన హైప్ లేకుండా నింపాదిగా వచ్చి, నింపాదిగా ఆడి, మంచి వసూళ్లను సాధించుకుంది మోహన్ లాల్ సినిమా. అయితే ఈ పులి మురుగన్ వేట అప్పుడే అయిపోలేదు.. వసూళ్ల హోరు సైలెంట్ గానే కొనసాగుతోంది.