డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణం గురించి ఈడీ చేపట్టిన విచారణకు హాజరైన దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్ ను అధికారులు బ్యాంక్ ట్రాన్సక్షన్ల గురించి వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. క్రమ సంఖ్య వన్ గా ఈ విచారణకు ముందుగా హాజరయ్యాడు పూరీ జగన్నాథ్.
ఈ క్రమంలో ఆయన బ్యాంకు లావాదేవీల గురించి అధికారులు ఆరా తీసినట్టుగా సమాచారం. డ్రగ్స్ కేసులు నమోదు కాక ముందు నుంచి, ఆ తర్వాత గత నాలుగేళ్లుగా పూరీ అకౌంట్ నుంచి జరిగిన నగదు బదిలీలన్నింటినీ ఈడీ అధికారులు పరిశీలించారట. ఒక చార్టెడ్ అకౌంటెండ్ సమక్షంలో అధికారుల సందేహాల వెల్లడి, పూరీ సమాధానాలు సాగినట్టుగా సమాచారం.
ప్రత్యేకించి విదేశీ అకౌంట్లకు నగదు బదిలీలు వంటివే ఈ విచారణలో కీలకం అని స్పష్టం అవుతోంది. డ్రగ్స్ కేసులు నమోదైంది 2017లో. అంతకు ముందు పూరీ అకౌంట్ల నుంచి జరిగిన నగదు బదిలీల వివరాలను అధికారులు భూతద్దంలో చూసే అవకాశాలున్నాయి. డ్రగ్స్ కేసులు నమోదైనప్పుడు సినీ సెలబ్రిటీలందరూ కేవలం బాధితులుగానే నిలిచారు.
వారిపై అప్పట్లో అరెస్టులూ గట్రా చర్యలేవీ లేవు. అయితే ఆ కేసులో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని సిట్ అప్పట్లో నివేదించడంతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసుల్లో కూడా సినీ తారలను సాక్షులుగానే విచారిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ల ట్రాన్షాక్షన్ లను పరిశీలిస్తున్నారనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో గనుక వీరి డైరెక్ట్ ఆర్థిక లావాదేవీలున్నాయనే అంశంపై ఈ పరిశోధన జరుగుతోందేమో!