సరదాకే అన్నాడో, నిజంగానే మనసులో వున్నది బయటపెట్టాడోగానీ ఓ సినిమా ఆడియో విడుదల వేడుకలో ‘భవిష్యత్తులో పెళ్ళిళ్ళు వుండనే వుండవు..’ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు కాస్త అలజడి సృష్టించాయి. ఇటీవలి కాలంలో ‘సహజీవనం’ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఎఫైర్ ముదిరితే సహజీవనం. ఇద్దరు మనుషులు మానసిక బంధంతో ఒక్కటైనప్పుడు, ఇంకా పెళ్ళి గట్రా ఎందుకు.? అన్న భావనలు ఎక్కువైపోతున్నాయి.
కమల్‌హాసన్, గౌతమి సహజీవనం చేస్తున్నారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొత్త తరం నటీనటుల్లోనూ పెళ్ళి గురించిన ఆలోచనలు తగ్గిపోతున్నాయి. సహజీవనమే బెటర్.. అన్న అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి. తాజాగా తాప్సీ సైతం, సహజీవనమే బెటర్.. అని తేల్చేసింది. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన విషయమా.? అని ఏ హీరోని ఏ హీరోయిన్‌ని అడిగినా, ఏదైనా ఒకే అని మొహమాటానికి చెబుతూ, చివరగా ప్రేమ పెళ్ళికే ఓటేస్తున్నారు.
ప్రేమ పెళ్ళిని తప్పు పట్టలేం. కానీ, సహజీవనం వైపు సెలబ్రిటీలు మొగ్గు చూపుతుండడం, దానికి పబ్లిక్‌గా మద్దతు పలుకుతుండడంపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజీవనంపై న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్‌లో వున్నాయి. సహజీవనం పుణ్యమా అని చాలా కేసులు న్యాయస్థానాలకే సవాల్ విసురుతున్న పరిస్థితి. ఏమో, రానున్న రోజుల్లో సహజీవనంపై క్రేజ్ ముదిరి పాకాన పడ్తుందేమో.. అదే జరిగితే పూరి మాటలు నిజమైనట్టే.!