పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. అప్పట్లో 'ఆటోజానీ' అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు. అయితే, సినిమా సెకెండాఫ్ చిరంజీవికి నచ్చలేదు. ఆ విషయాన్ని మెగా క్యాంప్ ఓ సందర్భంలో ప్రస్తావించడంతో పూరి జగన్నాథ్ హర్టయ్యాడు. అయినాసరే, చిరంజీవితో సినిమా చేసి తీరతానన్నాడు పూరి.
మధ్యలో 'లోఫర్' సినిమా చేసేశాడు, ఇటీవల 'ఇజం' సినిమా చేసేశాడు. కానీ, మెగా కాంపౌండ్ నుంచి మళ్ళీ పూరికి చిరంజీవి సినిమాపై పిలుపు రాలేదు. ఇటీవల 'ఇజం'తో కళ్యాణ్‌రామ్ నిర్మాతగానూ, హీరోగానూ దెబ్బతినేశాడన్న ప్రచారంతో, మెగాస్టార్ డెసిషన్ కరెక్టేటన్న ప్రచారం తెరపైకొచ్చింది. పూరి, సబ్జెక్ట్ విషయంలో ఏమాత్రం రాజీ పడ్డంలేదనీ, తాను అనుకున్నట్టుగా సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో మోనార్క్‌లా వ్యవహరిస్తూ ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడనే వాదన ప్రముఖంగా విన్పిస్తోందిప్పుడు.
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇలాంటి విమర్శలు మామూలే. అదే, పూరి నుంచి ఓ సూపర్ సక్సెస్ వస్తే మళ్ళీ అంతా కామప్ అయిపోతుంది. అందుకే, పూరి వున్నపళంగా ఓ సూపర్ హిట్ కొట్టి తీరాల్సిందే. చిరంజీవితో సినిమా అటకెక్కడం, ఎన్టీఆర్‌తోనూ సినిమా ఓకే కాకపోవడం, మహేష్‌తో చేయాలనుకున్న సినిమాకీ లైన్ క్లియర్ కాకపోవడం, ఆఖరికి రవితేజ కూడా 'అందుబాటులో' లేకపోవడం.. ఇవన్నీ చూస్తుంటే, పూరి కెరీర్ మరోమారు కన్‌ఫ్యూజన్‌లో పడిందేమో అన్పిస్తోంది కదూ.!