ఆర్ ఎక్స్ 100 – త్రీ

అనుకున్నట్లే అవుతోంది. దర్శకుడు మారుతి అప్పట్లో ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలు తీసి, సక్సెస్ కొట్టిన తరువాత ఓ వంద సినిమాలు ఆ మోడల్ లో వచ్చి వుంటాయి. కానీ వాటిల్లో జిగేల్…

అనుకున్నట్లే అవుతోంది. దర్శకుడు మారుతి అప్పట్లో ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలు తీసి, సక్సెస్ కొట్టిన తరువాత ఓ వంద సినిమాలు ఆ మోడల్ లో వచ్చి వుంటాయి. కానీ వాటిల్లో జిగేల్ మన్న వాటికన్నా ఢమాల్ అన్నవే ఎక్కువ. ఆ రోజుల్లో యూట్యూబ్ వ్యవహారం తక్కువ కాబట్టి, అన్ని ఊళ్లలో గోడలనిండా పసందైన పోస్టర్లు మాత్రమే తెగ హల్ చల్ చేసేవి.

పోస్టర్లు చూసి, జనాలు సినిమాలు మాత్రం చూడకుండా వదిలేసేవారు. దాంతో ఆ జోరు అలా ఓ ఏడాది తరువాత తగ్గింది. ఇప్పుడు మళ్లీ అలాంటి వేలాం వెర్రి కనిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100 అనే చిన్న సినిమా ఆ మధ్య వచ్చింది. అది హిట్ అయింది. నాలుగు డబ్బులు వచ్చాయి. దాంతో ఇక ఆ టైపు సినిమాల దాడి మొదలయింది.

కొద్దిరోజుల క్రితం నాటకం అనే సినిమా దాదాపు అదే ఛాయల్లో వచ్చింది. ఇప్పుడు మరో ట్రయిలర్ బయటకు వచ్చింది. రథం అనే సినిమా ట్రయిలర్ ఈరోజు విడుదల చేసారు. అది కూడా ఆర్ ఎక్స్ 100 పోకడల్లోనే వున్నట్లు కనిపిస్తోంది.

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే, ఫస్ట్ వచ్చిన సినిమా ఎందుకు హిట్ అయిందన్నది ప్రోపర్ గా గమనించరు. అందులో వున్న అడల్ట్ కంటెంట్ లేదా వయిలెన్స్ లో రానెస్ వల్ల హిట్ అయిందని అనుకుంటారు. ఇక సినిమా సినిమాకు వాటిని పెంచుకుంటూ పోయి, వెగటు పుట్టే రేంజ్ కు తీసుకువస్తారు. ఈ ప్రయాణం ఇలా ఓ ఏడాది సాగుతుంది. భరించక తప్పదు.