మళ్లీ రావా సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద తనఉనికి చాటుకున్న హీరో సుమంత్. అతగాడి లేటెస్ట్ సినిమా సుబ్రహ్మణ్యపురం. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ అని చెప్పకపోయినా, దాదాపు అదేరీతిలో తయారవుతున్న సినిమా ఇది. ఎటొచ్చీ స్టార్ కాస్ట్ అంతా వేరు. ఈ సినిమాలో కూడా ఓ గుడిచుట్టూ తిరిగేకథ, దాంట్లో మిస్టరీ అన్నది కీలకం.
ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించి వాయిస్ ఓవర్ ను హీరో రానా చేత చెప్పించడం విశేషం. ఒక విధంగా రానా-సుమంత్ బంధువులే. అందుకే సుమంత్ సినిమా కావడంతో రానా వాయిస్ ఓవర్ చెప్పడానికి ముందుకు వచ్చారు. కేవలం ఒకచోట కాకుండా పలుచోట్ల ఈ వాయిస్ ఓవర్ వినిపిస్తుందని సమాచారం.
సినిమాలో ఎస్పీబీ పాడిన థీమ్ సాంగ్, రానా వాయిస్ ఓవర్, అలాగే బాహుబలి గ్రాఫిక్స్ టీమ్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ పాయింట్లుగా వుంటాయని యూనిట్ భావిస్తోంది. సంతోష్ జాగర్లమూడి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీరమ్ సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 7న విడుదలవుతోంది.