బాహుబలి పార్ట్ వన్ కు తెలుగు మీడియా ఎంతగా ప్రచారం ఇచ్చి సహకరించిందీ అంటే , ఇంతా అంతా కాదు. కానీ రాజమౌళి అండ్ కో కు మాత్రం తెలుగు మీడియా అస్సలు ఆనలేదు. పైగా విడుదలకు ముందు ముంబాయిలో కూర్చుని బాలీవుడ్ మీడియా తో తెగ ఇంటరాక్ట్ అయ్యారు.
రెండో పార్ట్ స్టార్ట్ అయిన తరువాత కూడా ఇదే తంతు. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా బాహుబలి సెట్ లకు వచ్చి, ఫోటోలు తీసి, అక్కడ హడావుడి చేసింది. తెలుగు మీడియాకు ఒక్కటంటే ఒక్క స్టిల్ కూడా లేదు. బాహుబలి టీమ్ ధీమా ఏమిటంటే, నేషనల్ మీడియా ఒక్కటి వేసినా, తెలుగు మీడియా పోటీలు పడి మరీ దాన్ని అంది పుచ్చుకుని ప్రజలకు చేరుస్తాయని.
అయితే ఇప్పుడు ఓ సమస్య వుంది. బాహుబలి రేట్లు ఇంతా అంతా కావు. కనీ వినీ ఎరుగని రేట్లు. తొలిభాగం ఎంత షేర్ వసూలు చేసిందో, అదే మలిభాగం అమ్మకం ధర. అంటే మరి తొలిభాగం చూసిన వాళ్ల కన్నా అధికంగా ఈ మలిభాగాన్ని చూడాల్సి వుంది. అందువల్ల బాహుబలి తొలిభాగానికి వచ్చిన దానికన్నా, ఎక్కువ హైప్ కావాలి. లాస్ట్ టైమ్ ఓ అగ్రశ్రేణి పత్రిక బాహుబలిని తన భుజాలపై మోసింది.
బాహుబలి చూడకపోవడం, అంటే పుష్కర స్నాం చేయకపోవడం అన్నంత మహా పాపం అన్నట్లు వార్తలు వండి వార్చారు. దీంతో జనం క్యూ కట్టారు. అలా కట్టిన వాళ్లలో కొంత శాతం మంది అయినా నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు మళ్లీ వాళ్లు, ఈ పుష్కరాల టైపు ప్రచారం నమ్మడం అంత సులువు కాదు.
అందుకే ఇప్పటి నుంచి ప్రతి మీడియా కూడా ఇక బాహుబలిని కాస్త పట్టించుకోవాలి. బహుశా అందుకే కావచ్చు. రాజమౌళి అండ్ కో రేపు లోకల్ మీడియాతో ఇంట్రాక్ట్ కాబోతోంది.