రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ నటిస్తే ఈ సినిమా మేకింగ్ ఏ రేంజ్ లో వుండాలి. మన దగ్గర పెద్ద హీరో సినిమా అయితే పనిమనిషి క్యారెక్టర్ కు కూడా సరైన స్టార్ నే వుండాలి. కానీ కబాలి సినిమా రజనీ సినిమాల్లో అతి తక్కువ ఖర్చు చేసిన సినిమాట.
రజనీ పారితోషికం, ఇతరుల పారితోషికం, సాంకేతిక నిపుణుల సంగతి పక్కన పెడితే, నిర్మాణం ఖర్చు కేవలం పదకొండు కోట్లే అని వినిపిస్తోంది. మలేషియాలో సినిమా ఖర్చు అతి తక్కువట. అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలు చాలా తక్కువకే లభిస్తాయట. ఇక రజనీ సినిమా అంటే అక్కడ దాదాపు అన్నీ ఫ్రీగా లభిస్తాయట. అక్కడి తమిళులు అంతా తమ నుంచి ఏం సహాయం కావాలంటే అది ఫ్రీగా అందిస్తారట. ఇళ్లు, వాహనాలు, లొకేషన్లు, హోటళ్ల వాళ్లు ఇలా అందరూ కూడా. అందుకే నిర్మాణం చాలా తక్కువలో పూర్తయిందని వినికిడి.
ఇక రజనీ మినహా పెద్దగా స్టార్ కాస్ట్ లేని సంగతి తెలిసిందే.
బయర్లను కొట్టి నిర్మాతకు
రజనీ బయ్యర్ల పట్ల సరియైన బాధ్యతతో వ్యవహరించలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. నిర్మాత చాలా తక్కువలో సినిమా పూర్తి చేసారని తెలిసినపుడు, తన రెమ్యూనిరేషన్ కలిపి, కనీసపు లాభం వుండేలా చూసుకుని, సినిమాను అమ్మించి వుండాల్సిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
రజనీ క్రేజ్ ను అడ్డం పెట్టకుని నిర్మాత భారీ రేట్లకు అమ్మి సుమారు 50 కోట్లు లాభం చేసుకున్నారని, ఇప్పుడు కొన్నవాళ్లు నష్టాలపాలవుతున్నారని అంటున్నారు. గతంలో బాబా సినిమాకు తనే నిర్మాత కాబట్టి, రజనీ నష్టాలు భర్తీ చేసారని, ఇప్పుడు మరి ఎవరు చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సారి నష్టపోయేది ఊళ్లవారీ, థియేటర్ల వారీ కొనుక్కున్నవారే అని, అందువల్ల నిర్మాతపై అంత ప్రెజర్ వుండకపోవచ్చని తెలుస్తోంది.