ఓవైపు రీసెంట్ గా ఒప్పుకున్న కన్నడ రీమేక్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రావాల్సిన ఈ ప్రాజెక్టు, చేతులు మారి సుమంత్ చెంతకు చేరినట్టు కథనాలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నాడు రాజశేఖర్. వీరభద్రమ్ చౌదరి అనే దర్శకుడితో తాజాగా కథాచర్చలు ప్రారంభించాడు.
వీరభద్రమ్.. దాదాపు లైమ్ లైట్ నుంచి తప్పుకున్న దర్శకుడు ఇతడు. చిన్నచిన్న ప్రారంభోత్సవాల్లో కనిపించడం మినహా మెగాఫోన్ పట్టుకొని చాన్నాళ్లయింది. పైగా ఫ్లాప్ దర్శకుడు కూడా. నాగార్జునతో తీసిన భాయ్ సినిమా తర్వాత ఇతడి కెరీర్ నాశనం అయింది. ఆ తర్వాత తీసిన చుట్టాలబ్బాయ్ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో మూడేళ్లుగా వీరభద్రమ్ ఖాళీ.
ఇలాంటి దర్శకుడితో రాజశేఖర్ కథాచర్చలు ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. రాజశేఖర్ కోసం 2-3 స్టోరీలైన్స్ రెడీ చేశాడట వీరభద్రమ్. ప్రస్తుతం ఆ స్టోరీలైన్స్ పై హీరో-దర్శకుడి మధ్య చర్చలు సాగుతున్నాయి. రాజశేఖర్ ఏ స్టోరీలైన్ కు ఓకే చెబుతాడో, ఆ లైన్ పై వర్క్ చేసి, పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకురావాలనేది వీరభద్రమ్ ప్లాన్. నిర్మాత ఎవరనేది తర్వాత తేలుస్తారు.
సినిమా-సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు రాజశేఖర్. గరుడవేగ లాంటి సక్సెస్ తర్వాత కూడా వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. చాలా గ్యాప్ తీసుకొని కల్కి చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరోసారి రాజశేఖర్ కెరీర్ లో గ్యాప్ మొదలైంది. ఈసారి ఏ దర్శకుడితో, ఎలాంటి సినిమాతో రాజశేఖర్ తెరపైకొస్తాడో చూడాలి.