రజనీకాంత్ కొత్త సినిమా “కాలా” నిన్నంతా సందడి చేసింది. ఉదయం టైటిల్ రిలీజ్ చేసి, సాయంత్రానికి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయడంతో టోటల్ ఇండియాలో ఇదే ట్రెండింగ్ అయింది. రజనీకాంత్ కు కెరీర్ లో ఇది 161వ సినిమా. అంతే కాదు.. ఆయన కెరీర్ లో హీరోగా ఇదే ఆఖరి సినిమా అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తన లాస్ట్ సినిమాను నిర్మించే అవకాశాన్ని అల్లుడు ధనుష్ కు అప్పగించారని టాక్.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయం. ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వని రజనీ.. తెరవెనక మాత్రం పొలిటికల్ రీఎంట్రీపై భారీగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తను పెట్టబోయే పార్టీకి ఏ గుర్తు ఉండాలి, ఏ పేరు పెట్టాలి, ఎజెండా ఎలా ఉండాలి లాంటి అంశాల్ని ఫైనలైజ్ చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు రజనీకాంత్. ఈ ముగ్గురూ రజనీకాంత్ కు అత్యంత సన్నిహితులు. వీళ్లలో కోలీవుడ్ కు చెందిన ఓ పాత్రికేయుడు కూడా ఉన్నారు.
ఆగస్ట్ 15న తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారు రజనీకాంత్. ఒకసారి పార్టీని ప్రకటించిన తర్వాత ఇక సినిమాల వైపు చూడకూడదని ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే ఈ వయసులో సినిమాలు, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమనే విషయం రజనీకాంత్ కు తెలుసు. కొత్త పార్టీని ఎనౌన్స్ చేసిన వెంటనే తమిళనాట దాదాపు అన్ని కీలక ప్రాంతాల్లో వరుసపెట్టి బహిరంగ సభలు ఏర్పాటుచేయాలనేది రజనీకాంత్ ఆలోచన. సో.. “కాలా”నే రజనీకాంత్ కెరీర్ లో చివరి సినిమా అవ్వొచ్చు.