ఏ సినిమా అయినా బాక్సాఫీస్ లెక్కలు తప్పనిసరి. చాలా అరుదుగా మాత్రమే కమర్షియల్ విలువలకి దూరంగా వుండే సినిమాలు వసూళ్ళ పంట పండిస్తుంటాయి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ విషయంలో కమర్షియల్ లెక్కలైతే పక్కాగా వుండాల్సిందే. లేదంటే, ఫలితం తేడా కొట్టేస్టుంటుంది. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ నుంచి వచ్చిన భారీ ఫ్లాప్స్ 'కొచాడియాన్', 'లింగా' సినిమాలు. 'లింగా' కమర్షియల్ సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లని నిండా ముంచేసింది.
ఇప్పుడిక రజనీకాంత్ హీరోగా రూపొందిన 'కబాలి' విడుదలకు సిద్ధమయ్యింది. తెలుగులో రికార్డు స్థాయిలో ఈ సినిమాకి చెల్లింపులు జరిగిపోయాయి. తమిళంలో చెప్పుకోడానికేముంది.? 'కొచాడియాన్', 'లింగా' రిజల్ట్‌ని లెక్కచేయకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎగబడ్డారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు జరిగిపోయిందన్నది 'కబాలి' గురించి విన్పిస్తున్న మాట. అది నిజమేనా.? అన్నది వేరే విషయం.
ఈ నెల 22న 'కబాలి' విడుదలవుతుండడంతో, విడుదల ముహూర్తం దగ్గర పడ్తున్నకొద్దీ అభిమానుల్లోనే కాదు, డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లలోనూ టెన్షన్ పీక్స్‌కి వెళ్ళిపోతోంది. ప్రోమో వీడియోస్‌లోనూ పెద్దగా కమర్షియల్ కోణం కన్పించడంలేదాయె. స్టైలిష్ సినిమా అనే వాదన విన్పిస్తోంది. అదే సమయంలో, మాస్ మెచ్చే అన్ని అంశాలూ వున్నాయంటున్నారు. ప్రస్తుతానికైతే సినిమాలో ఏముందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అనుమానాలిలా వుంటే, పబ్లిసిటీ పీక్స్‌కి వెళ్ళిపోతోంది. నిన్నటికి విన్పించిన ప్రచార ఆర్భాటాలకీ, నేడు విన్పిస్తోన్న ప్రచార ఆర్భాటాలకీ చాలా తేడా. రోజురోజుకీ ఈ ఆర్భాటాలే ఓ రేంజ్‌లో అనిపిస్తున్నాయి. ఇన్ని అంచనాల్ని రజనీకాంత్ 'కబాలి' తట్టుకుంటుందా.? గత సినిమాలతో నిండా ముంచేసిన రజనీకాంత్, 'కబాలి'తో బౌన్స్ బ్యాక్ అవుతాడా.? అందరికీ లాభాలు మిగుల్చుతాడా.? ఏమో, ఈ ప్రశ్నలకు సినిమా రిలీజయ్యాకే సమాధానం దొరుకుతుంది.