డివివి దానయ్య జాక్ పాట్ కొట్టినట్లే వుంది. వరుసపెట్టి మరో రెండుమూడేళ్ల వరకు భారీ సినిమాలు నిర్మించేలాగే వున్నారు. ప్రస్తుతం బోయపాటి-బన్నీ సినిమా పూర్తి కావస్తోంది. దీని తరువాత కొరటాలశివ బన్నీ సినిమా వుంటుందని టాక్.
అది అలా వుండగానే రామ్ చరణ్ తో ఓ తమిళ రీమేక్ కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వినికిడి. ఎడిటర్ మోహన్ కుమారుడు జయం రవి నటించిన సినిమా ఇటీవల పెద్ద హిట్ అయింది. థని ఒరువన్ అనే ఆ సినిమాను తెలుగులో చేయాలని రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దీన్ని తిరుపతిరాజుతో కలిసి దానయ్య నిర్మించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఓ రోడ్ బ్లాక్ వుంది. ఎడిటర్ మోహన్ తెలుగులో సినిమా తీసి చాలా కాలం అయింది. తమిళంలో ఆయన ఒక కుమారుడు దర్శకుడిగా, మరో కుమారుడు హీరోగా వున్నారు. అందువల్ల ఆయన కాస్త విశ్రాంతిగానే వుండిపోయారు. ఇటీవల ఎడిటర్ మోహన్ హైదరాబాద్ లో ఓ మాంచి ప్రాపర్టీ సేల్ చేసారని, ఆ మొత్తాన్ని తెలుగులో సినిమాకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ రీ ఎంట్రీకి ఇటీవల హిట్ అయిన కొడుకు సినిమా థని ఒరువన్ ను వాడుకోవాలన్నది ఆయన ఆలోచన. నిజానికి రామ్ చరణ్ సహా మరి కొందరు కూడా ఆ సినిమా హక్కులపై ఆసక్తి కనబర్చారు. కానీ మోహన్ ఎవరికీ మాట ఇవ్వలేదు. అయితే తమిళంలో సినిమాను డైరక్ట్ ను చేసిన తన కుమారుడు రాజాకే తెలుగులో చేసే అవకాశం, అలాగే సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇచ్చే పక్షంలో రీమెక్ హక్కులు ఇవ్వడానికి మోహన్ సుముఖంగా వున్నట్లు బోగట్టా.