మల్టీస్టారర్ సినిమాలు చేస్తామని అంతా చెబుతారు. కానీ మంచి కథ సెట్ అవ్వాలంటూ ఎవరికి వారు తప్పించుకుంటారు. ఈమధ్య కాలంలో కొత్తదనం కోసం పరితపిస్తున్న రామ్ చరణ్ మాత్రం ఓ మల్టీస్టారర్ కు ఓకే చేసినట్టు తెలుస్తోంది. అది కూడా మణిరత్నం దర్శకత్వంలో.
లెక్క ప్రకారం మణిరత్నంతో చెర్రీ ఓ సినిమా చేయాలి. కానీ చెలియా సినిమా డిజాస్టర్ తో ఆ ప్రపోజల్ నుంచి చరణ్ తప్పుకున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఆగిపోలేదట.
చరణ్-మణిరత్నం కాంబోలో సినిమా ఉందట. అది కూడా మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. రామ్ చరణ్ తో పాటు దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ హీరోలుగా ఈ సినిమా రాబోతోందట.
ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు దుల్కర్. ఇక ఫహాద్ ఫాజిల్ విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ తనయుడే ఈ ఫహాద్. పలు మలయాళ సూపర్ హిట్స్ తో పాపులర్ అయిన ఈ నటుడు.. ఈ మధ్యే హీరోయిన్ నజ్రియాను పెళ్లాడాడు.
ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుపైనే మణిరత్నం వర్క్ చేస్తున్నాడట. ధృవ సినిమా నుంచి చెర్రీ ట్రాక్ మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న మూవీ కూడా కాస్త భిన్నమైనదే. ఇప్పుడు మణిరత్నం మూవీ కూడా అలాంటిదే అంటున్నారు.