టైటిళ్లు ఇప్పుడు డిఫరెంట్ గా వుండాల్సి వస్తోంది. అందుకోసం డిఫరెంట్ గా ఆలోచించాల్సి వస్తోంది. అందుకోసం ఎక్కడెక్కడ లేని టైటిళ్లు వెదుకుతున్నారు. లేటెస్ట్ గా అన్నపూర్ణ స్టూడియో 'రంగుల రాట్నం' అంటోంది. గతంలో రాజ్ తరుణ్ తో ఇదే బ్యానర్ సమర్పణలో ఉయ్యాల జంపాల అన్నారు. ఇప్పుడు రంగుల రాట్నం అంటున్నారు.
తమిళ రంగానికి చెందిన కొత్త మహిళా దర్శకురాలు అందించిన కథ, కథనాలతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఓ మాంచి ఫీల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో. కొత్త అమ్మాయి హీరోయిన్. ఈ సినిమాకు రంగుల రాట్నం అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. కానీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించాలని చూస్తున్నారు.
సినిమా దాదాపు పూర్తయిపోయింది. నవంబర్ లేదా డిసెంబర్ ల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. నాగార్జున-అఖిల్ సినిమాలు రెండు వున్నాయి. ఆ రెండింటికి మధ్య నెలలో ఈ సినిమాను వదుల్తారన్నమాట. రంగుల రాట్నం అన్నది అలనాటి బిఎన్ రెడ్డి నిర్మించిన క్లాసిక్ సినిమా.చంద్రమోహన్ హీరోగా నటించిన తొలి సినిమా.