రవిప్రకాష్.. శివాజీ ఎక్కడ?

ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ అన్నది తెలుగుదేశం అండంతో తమ చిత్తానికి వ్యవహరించిన వారికి మాత్రం, ఎంత మాత్రం సేఫ్ కాదు. తెలంగాణాలో డేటా చోరీ కేసు పడినపుడు కానీ, టీవీ 9…

ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ అన్నది తెలుగుదేశం అండంతో తమ చిత్తానికి వ్యవహరించిన వారికి మాత్రం, ఎంత మాత్రం సేఫ్ కాదు. తెలంగాణాలో డేటా చోరీ కేసు పడినపుడు కానీ, టీవీ 9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్, శివాజీల మీద కేసులు పడినపుడు కానీ, వారు ఆంధ్రలోనే అక్కడ తెలుగుదేశం నేతల అండతో రహస్య ఆశ్రయంలో వున్నారనే వార్తలు వచ్చాయి.

మరి ఇప్పటి సంగతేమిటి? ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడి పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడానికి అవకాశం తక్కువే. మరి ఇలాంటి నేపథ్యంలో రవిప్రకాష్ ఎక్కడున్నట్లు? తెలంగాణలో అయితే వుండరు. ఎందుకంటే అక్కడి పోలీసలు దుర్భిణీ వేసి గాలిస్తున్నారు.

ఆంధ్రలో ప్రస్తుతానికి ఎలావున్నా, వన్స్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే, పోలీసులను ఆ దిశగా నడపడం ఖాయం. ఇప్పటికే కాబోయే సిఎమ్ మనసు తెలుసు కనుక, పోలీసులు అక్కడ కూడా ఓ కన్ను వేసే వుంటారు? అందువల్ల రవిప్రకాష్, శివాజీ ఇప్పటికే ఆంధ్ర నుంచి స్కిప్ అయి వుంటారని అనుకోవాలి.

రవిప్రకాష్ కు అన్నివైపుల నుంచి చుక్కేదురవుతోంది. మిగిలింది ఒక్కటే ఆశ అని టాక్ వుంది. ప్రధాని మోడీతో వున్న అనుబంధం. ఆ అనుబంధంతోనే ఇటీవల టీవీ9 హిందీ చానెల్ ఓపెనింగ్ కు మోడీని రప్పించగలిగారు రవిప్రకాష్. మోడీకి సంకేతాలు, సందేశాలు పంపించి కాపాడమని కోరడం ఒక్కటే మిగిలింది.

కానీ ఈ పని సాధించేలోగా అరెస్టు కాకుండా వుండాలి. అలా వుండాలంటే మరి ఎక్కడ వుండాలి? ఎలా వుండాలి? ప్రస్తుతం బాబుకు సన్నిహితం అయిన దీదీ అడ్డా కలకత్తా, లేదా కేజ్రీవాల్ సహాయంతో ఢిల్లీలో రవిప్రకాష్ వుండి వుండాలని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య శివాజీ ఓ వీడియో సందేశం విడుదల చేసి, నాలుగు రోజులు గడువు అడిగారు. అది సరిగ్గా కౌంటింగ్ డేట్. అంటే కౌంటింగ్ బాబు గవర్నమెంట్ మళ్లీ వస్తుందని శివాజీ ఆశపడినట్లున్నారు. కానీ అది జరగలేదు. ఎన్నికల ముందు శివాజీ చేసిన హంగామా ఇంతా అంతా కాదు.

వాల్ బోర్డ్, మార్కర్ పట్టకుని, ప్రెస్ మీట్ లు పెట్టి, బాబుకు అనుకూలంగా నడిపిన డ్రామాలు ఇన్నీ అన్నీ కావు. మరి ఇప్పుడు కొత్తగా ఏం వీడియో విడుదల చేస్తారో చూడాలి.