ఏడాది గ్యాప్ తర్వాత సెట్స్ పైకి వచ్చాడు. ఆ గ్యాప్ ను భర్తీ చేయడం కోసం ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. మినిమం గ్యాప్ లో ఈ రెండు సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొచ్చి సందడి చేద్దాం అనుకున్నాడు. కానీ రవితేజ ప్లాన్స్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ మూవీతో రవితేజకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ సినిమాతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మాస్ రాజా.
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు రవితేజ. విక్రమ్ సిరి చెప్పిన స్టోరీలైన్, నెరేషన్, డైలాగ్స్ అన్నీ బాగా నచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నాడు. తీరా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసొచ్చింది రవితేజకు. దర్శకత్వ విభాగంలో విక్రమ్ సిరి చాలా వీక్ అట.
స్వతహాగా రైటర్ అయిన విక్రమ్ సిరి, దర్శకత్వంలో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. దీంతో ఒక దశలో సినిమా షూటింగ్ కూడా ఆపేశాడట రవితేజ. మళ్లీ నిర్మాతలు, మధ్యవర్తులు కాంప్రమైజ్ చేసి రవితేజను సెట్స్ పైకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోందట. ముందురోజు తీసిన సన్నివేశాల్నే రీషూట్స్ పేరిట మళ్లీ నెక్ట్స్ డే తీస్తున్నారట. డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అనుభవం ఉన్న రవితేజ దగ్గరుండి ఆ వ్యవహారాల్ని కూడా చూసుకుంటున్నాడట. దీంతో “టచ్ చేసి చూడు” ప్రాజెక్టుపై దాదాపు ఆశలు వదులుకున్నాడట రవితేజ.